రోహిత్, కోహ్లీలకు బిగ్ షాక్.. గిల్ ముందు పెద్ద సవాలు
Rohit Kohli ODI Future : ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టుకు యంగ్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. అప్పటి నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే భవిష్యత్‌పై చర్చలు హాట్ హాట్ గా మారాయి.

ఆస్ట్రేలియా పర్యటనతో రిటైర్మెంట్ చర్చలకు తెర
ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టును ఎంపిక చేసిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే భవిష్యత్తుపై హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ సిరీస్ కోసం యంగ్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దిశను స్పష్టంగా చూపిస్తున్నదని నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో కోహ్లీ, రోహిత్ శర్మల కెరీర్ పై అనిశ్చితి నెలకొంది.
భవిష్యత్ ప్రణాళికల వైపు బీసీసీఐ ముందడుగు
జట్టు కెప్టెన్సీని శుబ్ మన్ గిల్ కు అప్పగించి వచ్చే రెండేళ్లలో జరగబోయే వన్డే ప్రపంచకప్‌కు సరైన నాయకుడిగా అతన్ని పరిగణిస్తోంది. ఇది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెరీర్ ను ప్రభావితం చేసే అంశంగా కాకుండా భవిష్యత్ తరానికి బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశాన్ని సూచిస్తోంది. కానీ, రోహిత్ వన్డే ప్రపంచ కప్ ఆడాలనే ఉద్దేశాన్ని తెలిపిన తర్వాత కెప్టెన్సీ నుంచి తొలగించడం పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కోహ్లీని కూడా ప్రపంచ కప్ లో భాగంగా చూడటం లేదనే చర్చ హాట్ టాపిక్ గా మారింది.
అభిమానులు, మాజీ క్రికెటర్లు ఏమంటున్నారంటే?
గిల్‌కు కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత అభిమానులు, మాజీ ఆటగాళ్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు యువతకు అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయమని చెబుతుండగా, మరికొందరు రోహిత్, కోహ్లీ వంటి అనుభవజ్ఞులపై ఇంకా విశ్వాసం ఉంచవచ్చని అంటున్నారు. తాజాగా టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సైతం ఈ ఇద్దరు స్టార్లు ప్రపంచ కప్ లో ఆడతారా? అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.
"వన్డే ప్రపంచ కప్ రెండున్నర సంవత్సరాల దూరంలో ఉంది. ప్రస్తుతం పరిస్థితులపై ఉండటం ముఖ్యం. వారిద్దరూ నాణ్యమైన ఆటగాళ్ళు. ఆ ఇద్దరు విజయవంతమైన పర్యటనను కలిగి ఉంటారని ఆశిస్తున్నాను" అని మాత్రమే గంభీర్ విలేకరుల సమావేశంలో అన్నారు.
రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై అనిశ్చితి
ప్రస్తుతం బీసీసీఐ లేదా టీమ్ మేనేజ్‌మెంట్ నుండి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, ఈ ఎంపిక వన్డే ఫార్మాట్‌లో మార్పులకు సూచనగా భావిస్తున్నారు. రోహిత్ గతంలో భారత జట్టును విజయాల దిశగా నడిపించినప్పటికీ, ఇప్పుడు గిల్‌ను నూతన నాయకుడిగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. దీంతో రోహిత్, కోహ్లీల వన్డే కెరీర్ కు రాబోయే సిరీస్ లలో శుభం కార్డు పడనుందనే చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే బీసీసీఐ ఈ సీనియర్ స్టార్ ప్లేయర్లను ప్రపంచ కప్ జట్టులో భాగంగా చూడటం లేదనీ, దీనిని కెప్టెన్సీ మార్పులతో స్పష్టం చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే, శుబ్‌మన్ గిల్‌కు ఇది ఒక కీలక అవకాశం. కానీ, సీనియర్ ఆటగాళ్ల వారసత్వాన్ని కొనసాగిస్తూ, యువ జట్టును ముందుకు నడిపించడం అతనికి పెద్ద సవాలు కానుంది. రోహిత్, కోహ్లీ లాంటి ఆటగాళ్లు జట్టులో ఉండి మద్దతు ఇస్తే, ఈ మార్పు సాఫీగా సాగుతుందనే అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో ఉంది.