సౌతాఫ్రికాలోనూ ముంబయి ఇండియన్స్ జోరు.. SA20 టైటిల్ గెలిచిన MI కేప్‌టౌన్
Mumbai indians: దక్షిణాఫ్రికాలో జరిగిన SA20 క్రికెట్ టోర్నమెంట్‌లో MI కేప్‌టౌన్ జట్టు, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టును ఓడించి ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది.

సౌతాఫ్రికాలోనూ ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతోంది. అద్భుతమైన ఆటతో ఎస్ఏ 20 టైటిల్ ను గెలుచుకుంది. భారత్‌లో ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ లాగా దక్షిణాఫ్రికాలో SA20 అనే టీ20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. 2025 సంవత్సరానికి సంబంధించిన SA20 గత నెల రోజులుగా జరుగుతున్న ఈ టోర్నీలో తాజాగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో MI కేప్‌టౌన్ జట్టు, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు తలపడ్డాయి. ఇందులో ముందుగా బ్యాటింగ్ చేసిన MI కేప్‌టౌన్ జట్టు 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది.
ముంబై టీమ్ ప్లేయర్లు సిక్సర్ల వర్షం కురిపించారు. రియాన్ రికల్టన్ 4 సిక్సర్లతో 15 బంతుల్లో 33 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించాడు. డెవాల్డ్ బ్రెవిస్ రెండు బౌండరీలు, నాలుగు సిక్సర్లతో 18 బంతుల్లో 38 పరుగులు సాధించాడు. కోనార్ ఎస్టెర్‌హ్యూసెన్ 29 బంతుల్లో 39 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు తరపున మార్కో జాన్సెన్, రిచర్డ్ గ్లీసన్, లియామ్ డాసన్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. దీంతో 20 ఓవర్లలో ముంబై కేప్‌టౌన్ జట్టు 181 పరుగులు చేసింది.
ఆ తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు బ్యాట్స్‌మెన్లు కగిసో రబాడ, ట్రెంట్ బౌల్ట్ వేగ బౌలింగ్‌ను ఎదుర్కోలేక వరుసగా వికెట్లు కోల్పోయారు. ఆ జట్టులో టామ్ అబెల్ 30 పరుగులు చేశాడు. టోనీ డి జోర్సీ 26 పరుగులు సాధించాడు. మిగతా ఆటగాళ్లంతా స్వల్ప పరుగులకే అవుటయ్యారు. ఎంతో ఆశలు పెట్టుకున్న కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (6 పరుగులు), దూకుడు బ్యాట్స్‌మెన్ ట్రిస్టాన్ స్టబ్స్ (15 పరుగులు) కూడా నిరాశపరిచారు. దీంతో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు 18.4 ఓవర్లలో కేవలం 105 పరుగులకే ఆలౌటైంది.
దీంతో MI కేప్‌టౌన్ జట్టు 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి SA20 2025 ట్రోఫీని ఎగరేసుకుపోయింది. దక్షిణాఫ్రికా టీ20 టోర్నమెంట్‌లో MI కేప్‌టౌన్ జట్టు ట్రోఫీని గెలవడం ఇదే తొలిసారి. MI కేప్‌టౌన్ జట్టు తరపున కగిసో రబాడ 3.4 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, జార్జ్ లిండే చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఫైనల్లో కీలక వికెట్లు తీసిన ట్రెంట్ బౌల్ట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ టోర్నమెంట్‌లో 19 వికెట్లు తీయడంతో పాటు 209 పరుగులు చేసిన మార్కో జాన్సెన్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
ట్రోఫీ గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేసిన MI కేప్‌టౌన్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్, ''ఈ మ్యాచ్ మొత్తంలో మేము ఆడిన తీరు అద్భుతంగా ఉంది. ఒత్తిడిలో కూడా అందరు ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. మేము వ్యక్తిగత కోసం మాత్రం ఇన్నింగ్స్‌లు ఆడలేదు. అందరూ సహజంగా ఆటను కనబరిచి జట్టు కోసం ముందుకు సాగారు. గత సీజన్‌లో నేను వెన్ను గాయం కారణంగా ఆడలేకపోయాను. ఈసారి జట్టును నడిపించే బాధ్యత నాకు అప్పగించారు. ఈ MI కుటుంబంలో భాగం కావడం గర్వంగా ఉంది'' అని అన్నాడు.