పొట్టి ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన భారత వీరులు వీళ్లే..
T20 World Cup 2022: టీమిండియా ఈనెల 23న పాకిస్తాన్ తో మ్యాచ్ తో ప్రపంచకప్ వేట ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన ఏడు ప్రపంచకప్ లలో భారత జట్టు నుంచి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు, వికెట్లు తీసిన బౌలర్లెవరో ఇక్కడ చూద్దాం.
ఇప్పటికే ప్రారంభమైన టీ20 ప్రపంచకప్ లో మరో రెండ్రోజుల్లో సూపర్-12 పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. భారత జట్టు ఈనెల 23న పాకిస్తాన్ తో మ్యాచ్ తో ప్రపంచకప్ వేట ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన ఏడు ప్రపంచకప్ లలో భారత జట్టు నుంచి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు, వికెట్లు తీసిన బౌలర్ల జాబితాను ఒకసారి చూద్దాం.
2007లో ప్రారంభమైన టీ20 ప్రపంచకప్ తొలి ఎడిషన్ ను భారత్ గెలుచుకుంది. మొదటి ఎడిషన్ లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గౌతం గంభీర్. ఈ ఎడిషన్ లో గంభీర్.. ఆరు మ్యాచ్ లలో 227 పరుగులు చేశాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఆర్పీ సింగ్ (7 మ్యాచ్ లలో 12 వికెట్లు) ఉన్నాడు.
2009లో ట్రోఫీ విజేత పాకిస్తాన్. ఈ ఎడిషన్ లో భారత్ తరఫున యువరాజ్ సింగ్.. 5 మ్యాచ్ లలో 153 పరుగులు చేశాడు. 3 మ్యాచ్ లలో ప్రజ్ఞాన్ ఓజా ఏడు వికెట్లు తీశాడు. ఈ ఎడిషన్ లో టీమిండియా.. నాకౌట్ స్టేజ్ లోనే వెనుదిరిగింది.
2010లో కూడా భారత్ నాకౌట్ దశకే పరిమితమైంది. టీమిండియా బ్యాటర్ సురేశ్ రైనా.. ఐదు మ్యాచ్ లలో 219 పరుగులు సాధించాడు. ఈ సీజన్ లో రైనా.. సౌతాఫ్రికాతో మ్యాచ్ లో సెంచరీ కూడా చేశాడు. తద్వారా ఈ ఫార్మాట్ లో భారత్ తరఫున సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇక బౌలర్లలో ఆశిష్ నెహ్రా.. 5 మ్యాచ్ లలో 10 వికెట్లు పడగొట్టాడు.
2012లో కూడా భారత్ సెమీస్ చేరలేదు. ఈ సీజన్ లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. 5 మ్యాచ్ లలో 185 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. లక్ష్మీపతి బాలాజీ.. 4 మ్యాచ్ లలో 9 వికెట్లతో టాప్ లో ఉన్నాడు.
2014 టీ20 ప్రపంచకప్ ఎడిషన్ లో భారత్ ఫైనల్ చేరింది. ఈసారి కూడా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఆరు మ్యాచ్ లలో 319 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. 6 మ్యాచ్ లలో 11 వికెట్లు తీశాడు.
2016 ఎడిషన్ లో కూడా అత్యధిక పరుగుల వీరుడు విరాట్ కోహ్లీనే. ఈసారి కోహ్లీ.. ఐదు మ్యాచ్ లలో 273 పరుగులతో టాప్ లో ఉండగా.. బౌలర్లలో హార్ధిక్ పాండ్యా, ఆశిష్ నెహ్రాలు సమానంగా నిలిచారు. ఇద్దరూ కలిసి ఐదు మ్యాచ్ లలో ఐదు వికెట్లు తీశారు. ఈ ఎడిషన్ లో భారత్ సెమీస్ చేరింది.
2021లో దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో కూడా భారత్ సెమీస్ చేరలేదు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో కెఎల్ రాహుల్ ఉన్నాడు. రాహుల్.. 5 మ్యాచ్ లలో 194 పరుగులు చేశాడు. బౌలర్లలో రవీంద్ర జడేజా, బుమ్రాలు ఐదు మ్యాచ్ లలో ఏడు వికెట్లతో సమంగా నిలిచారు. మరి 2022 టీ20 ప్రపంచకప్ లో భారత్ నుంచి అత్యధిక పరుగులు చేసే బ్యాటర్, వికట్లు తీసే వీరులెవరో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.