- Home
- Sports
- Cricket
- సంజూ శాంసన్‌ను ఎంపిక చేయనందుకు కేరళ ఫ్యాన్స్ అసంతృప్తి.. నిరసనలతో బీసీసీఐకి షాక్ ఇచ్చేందుకు సన్నాహాలు..!
సంజూ శాంసన్‌ను ఎంపిక చేయనందుకు కేరళ ఫ్యాన్స్ అసంతృప్తి.. నిరసనలతో బీసీసీఐకి షాక్ ఇచ్చేందుకు సన్నాహాలు..!
Sanju Samson: టీమిండియా యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ ను టీ20 ప్రపంచకప్ జట్టులో ఎంపిక చేయనందుకు గాను అతడి సొంత రాష్ట్రం కేరళకు చెందిన అభిమానులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు.

Sanju Samson
వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిఉన్న టీ20 ప్రపంచకప్ లో ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ఆ జట్టులో సంజూ శాంసన్ కు మరోసారి నిరాశే మిగిలింది.
కనీసం స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలో కూడా శాంసన్ కు చోటు దక్కలేదు. దీంతో అతడి సొంత రాష్ట్రం కేరళ లో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ జట్టులో ఎంపిక చేసిన ఇద్దరు వికెట్ కీపర్లు రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ ల కంటే శాంసన్ ఎందులో తక్కువని సోషల్ మీడియాలో ఇప్పటికే రచ్చ చేస్తున్నారు.
తాజాగా శాంసన్ అభిమానులు బీసీసీఐకి షాకిచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తున్నది. త్వరలో తిరువనంతపురం వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 జరుగనున్నది. ఈ మ్యాచ్ కు ముందు స్టేడియం బయట నిరసన ప్రదర్శనలకు దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Image credit: PTI
ఇండియా - సౌతాఫ్రికా నడుమ ఈ నెల 28న తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టీ20 జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు బస చేసే హోటల్ తో పాటు స్టేడియం ముందు కూడా నిరసనలకు దిగేందుకు శాంసన్ ఫ్యాన్స్ ప్రణాళికలు రచిస్తున్నారని కేరళకు చెందిన పలు వార్తాపత్రికలు, ఛానెళ్లలో కథనాలు వెలువడుతున్నాయి.
తిరువనంతపురం టీ20కి స్టేడియం బయటే గాక లోపల కూడా సంజూశాంసన్ పేరుతో ఉన్న టీషర్టులు ధరించి నిరసన తెలపాలని అతడి అభిమానులు యోచిస్తున్నారని తెలుస్తున్నది.2022 లో శాంసన్ భారత్ తరఫున 6 టీ20లు, అన్నే వన్డేలు ఆడాడు. టీ20లలో.. 44.75 సగటు, 158.41 సగటుతో 179 పరుగులు చేశాడు.
ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ ను విజయవంతంగా నడిపిస్తున్న సంజూ శాంసన్ కు జాతీయ జట్టులో అవకాశాలు ఇవ్వకపోవడంపై ఇప్పటికే సోషల్ మీడియా లో క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవిషయం తెలిసిందే. టీ20లలో సరిగా ఆడకున్నా భారత జట్టు మాత్రం రిషభ్ పంత్ కే వరుసగా అవకాశాలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.