కెఎల్ రాహుల్, జోస్ బట్లర్, బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్... స్టార్ ఓపెనర్లకి కలిసి రాని టీ20 వరల్డ్ కప్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్లు కిక్కుని అందిస్తోంది. ఏ మాత్రం అంచనాలు లేని అసోసియేట్ దేశాలైన జింబాబ్వే, నెదర్లాండ్స్ కూడా టాప్ టీమ్స్‌కి పోటీ ఇస్తూ ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ మ్యాచ్‌ని తీసుకెళ్తున్నాయి. హోరాహోరీగా సాగుతున్న పొట్టి ప్రపంచకప్‌లో స్టార్ ఓపెనర్లు మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాక్, న్యూజిలాండ్‌తో మ్యాచుల్లో విఫలమైన ఆ తర్వాత ఆఫ్ఘాన్, నమీబియా, స్కాట్లాండ్‌లపై హాఫ్ సెంచరీలు చేసి టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు కెఎల్ రాహుల్. ఈసారి కూడా కెఎల్ రాహుల్‌పై భారీ అంచనాలే పెట్టుకుంది టీమిండియా. అందుకే ఆసియా కప్‌లో అట్టర్ ఫ్లాప్ అయినా రాహుల్‌కి అవకాశం ఇచ్చింది...
babar
పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 8 బంతులాడి 4 పరుగులు చేసి అవుటైన కెఎల్ రాహుల్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 బంతులాడి 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ 14 బంతులాడి 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మొత్తంగా మూడు మ్యాచుల్లో కలిపి 22 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, 36 బంతులు ఎదుర్కొన్నాడు...
rohit sharma
కెఎల్ రాహుల్ మాత్రమే కాదు, రోహిత్ శర్మ కూడా ఇప్పటిదాకా తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేకపోయాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 14 బంతుల్లో 15 పరుగులు చేసిన రోహిత్ శర్మ, పాకిస్తాన్‌పై 4 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో 39 బంతుల్లో 53 పరుగులు చేసి పర్వాలేదనిపించినా... పసికూనపై రోహిత్ రేంజ్ ఇన్నింగ్స్ అయితే ఇది కాదు...
పాకిస్తాన్ కెప్టెన్, ఓపెనర్ బాబర్ ఆజమ్ కూడా ఆస్ట్రేలియాలో బౌన్సీ పిచ్‌లపై ఆడడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు. ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన బాబర్ ఆజమ్, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 9 బంతులాడి 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో 6 బంతులాడి 4 పరుగులకే పెవిలియన్ చేరాడు...
ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా టీ20 వరల్డ్ కప్ 2022లో ఫెయిల్ అవుతున్నాడు. ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లో 18 పరుగులు చేసిన జోస్ బట్లర్, ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 బంతులాడి డకౌట్ అయ్యాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓటమికి జోస్ బట్లర్ త్వరగా అవుట్ కావడమే ప్రధాన కారణం...
Image credit: Getty
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా సొంత మైదానాల్లో జరుగుతున్న టోర్నీల్లో ఆకట్టుకోలేకపోతుండడం విశేషం. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 5 పరుగులకి అవుటైన డేవిడ్ వార్నర్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లోనూ 7 బంతులాడి 3 పరుగులకే అవుట్ అయ్యాడు వార్నర్...
వీరితో పాటు పాక్ మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ కూడా టీ20 వరల్డ్ కప్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.గత ఏడాది టీ20ల్లో 1500+ పరుగులు చేసిన రిజ్వాన్, టీమిండియాతో మ్యాచ్‌లో 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో 16 బంతులాడి 14 పరుగులు చేసిన రిజ్వాన్... నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో 39 బంతుల్లో 49 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...