Asia Cup: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆసియా కప్ కోసం ఆ ఇద్దరూ రెడీ..!
Asia Cup 2022 - India Squad: ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభంకానున్నది. ఈ మేరకు సోమవారం భారత జట్టును ప్రకటించనున్నారు.

ఈనెల 27 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కాబోయే ఆసియా కప్ కోసం జట్టును ఎంపిక చేసేందుకు గాను జాతీయ సెలక్షన్ కమిటీ మల్లగుల్లాలు పడుతున్నది. టీ20 ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో దానిని దృష్టిలో ఉంచుకునే జట్టును ప్రకటించాలని సెలక్షన్ సభ్యులు భావిస్తున్నారు.
దాదాపు రెగ్యులర్ ఫార్మాట్ ఆటగాళ్లనే ఆసియా కప్ కోసం ఎంపిక చేయనున్నట్టున్నారని సమాచారం. తుది జట్టులో టీమిండియా స్టార్ ఓపెనర్ కెఎల్ రాహుల్ తో పాటు ఆల్ రౌండర్ దీపక్ చహర్ లు ఆసియా కప్ లో రీఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తున్నది.
ఐపీఎల్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికాతో సిరీస్ కు ముందు గాయపడ్డ రాహుల్.. రెండు నెలల కాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఇటీవలే వెస్టిండీస్ సిరీస్ కు ఎంపికైనా కరోనా బారిన పడి మళ్లీ ఆటకు దూరమయ్యాడు. కానీ అతడు తాజాగా ఫిట్ గానే ఉన్నాడని బోర్డు వర్గాలు తెలిపాయి.
ఇదే విషయమై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘కెఎల్ కొత్తగా నిరూపించుకోవడానికి ఏమీలేదు. అతడు ఇప్పటికే క్లాస్ ఆటగాడు. రాహుల్ టీ20 ఆడుతున్నాడంటే అతడు ఓపెనర్ గానే బరిలోకి దిగుతాడు. పంత్, సూర్యకుమార్ లు మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు వస్తారు..’ అని తెలిపాడు
రాహుల్ కు గాయం కావడంతో పలు సిరీస్ లలో భారత జట్టు ఓపెనర్ల విషయంలో రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లతో ప్రయోగాలు చేస్తున్నది. వీరిలో ఇషాన్ కిషన్ మినహా మిగిలినవారెవ్వరూ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఇక రాహుల్ తిరిగివస్తే మాత్రం మళ్లీ అతడే రోహిత్ శర్మతో ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు.
రోహిత్ తో పాటు దీపక్ చహర్ కూడా ఆసియా కప్ కోసం ఎంపికవుతాడని తెలుస్తున్నది. ఫిబ్రవరిలో వెస్టిండీస్ తో మూడో టీ20 ఆడుతూ గాయపడ్డ అతడు మళ్లీ గ్రౌండ్ లో అడుగుపెట్టలేదు. ఐపీఎల్ ను కూడా మిస్ చేసుకున్న అతడు.. సుమారు ఐదు నెలల తర్వాత జింబాబ్వే టూర్ కు ఎంపికయ్యాడు. ఆ సిరీస్ చహర్ కు కీలకం కానున్నది.
చహర్ ను ఆల్ రౌండర్ కోటాలో జట్టులోకి తీసుకునే అవకాశముంది. టీ20 పప్రంచకప్ లో తప్పక ఉండే ఆటగాళ్లలో దీపక్ కూడా ఉన్నాడు. దీంతో అతడిని ఆసియా కప్ లో ఆడించి ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్ లలో కూడా ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నారు.
చేతన శర్మ ఆధ్వర్యంలోని సెలక్టర్ల కమిటీ ఈ నెల 8న ఆసియా కప్ కోసం 17 మందితో కూడిన సభ్యులను ఎంపిక చేయనుంది. జట్టు ఎంపికలో భాగంగా రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ లు ఫ్లోరిడా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెలక్షన్ కమిటీ మీటింగ్ లో పాల్గొంటారు.