Virat Kohli: మాట మార్చిన కపిల్ దేవ్.. కోహ్లీ ఇలాగే ఆడాలంటూ ప్రశంసలు
Kapil Dev: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ సరిగా ఆడటం లేదనే కారణంతో అతడిని ఇంకెందుకు జట్టులో ఉంచుతున్నారని ప్రశ్నించాడు కపిల్ దేవ్.. కానీ ఇప్పుడు మాత్రం..

గత కొన్నాళ్లుగా పామ్ లేమితో తంటాలుపడుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ పాకిస్తాన్ తో మ్యాచ్ లో తిరిగి టచ్ లోకి వచ్చినట్టే కనిపించాడు. ఆ మ్యాచ్ లో కోహ్లీ చేసింది 35 పరుగులే అయినా అతడు క్రీజులో ఉన్న కొద్దిసేపు మునపటి కోహ్లీ కనిపించాడు. అతడి ఆటతీరు, షాట్ సెలక్షన్ కూడా మారింది.
Image credit: PTI
అయితే నెల రోజుల క్రితం కోహ్లీ ఆటతీరుపై విమర్శలు గుప్పించిన కపిల్ దేవ్.. తాజాగా మాట మార్చాడు. ఐపీఎల్ ముగిసి ఇంగ్లండ్ పర్యటనలో కూడా కోహ్లీ విఫలం కావడంతో కపిల్.. చాలాకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకున్నా తుది జట్టులో కోహ్లీని ఎందుకింకా ఆడిస్తున్నారని ప్రశ్నించిన విషయం తెలిసిందే. అతడు విరామం తీసుకోవాలని కూడా కపిల్ సూచించాడు.
కానీ పాకిస్తాన్ తో మ్యాచ్ అనంతరం కపిల్ దేవ్ మాట మార్చాడు. తాజాగా అతడు కోహ్లీ గురించి మాట్లాడుతూ.. ‘ఇదే కోహ్లీ చివరి సిరీస్, చివరి అవకాశాలని మనం అనకూడదు. అది సరైంది కాదు. కోహ్లీ ఆడగలిగినన్ని రోజులూ క్రికెట్ ఆడాలి.
కొన్నిసార్లు మీరు ఎక్కువ రోజులు విరామం తీసుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే కోహ్లీ ప్రొఫెషనల్ ఆటగాడు. అతడికి ఆ సమస్య లేదనే నేను భావిస్తున్నా. నా వ్యక్తిగత అభిప్రాయమైతే.. కోహ్లీ వీలైనన్ని ఎక్కువ మ్యాచ్ లు ఆడాలి. అది చాలా ముఖ్యం. పరుగులు చేయడం ప్రారంభించాక మీ ఆలోచనా విధానం కూడా మారుతుంది..’ అని తెలిపాడు.
పాకిస్తాన్ తో మ్యాచ్ లో కోహ్లీ.. 34 బంతులాడి 35 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో తాను ఎదుర్కున్న రెండో బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కోహ్లీ.. తర్వాత పవర్ ప్లే లో చెలరేగి ఆడాడు. క్రీజులో ఉన్నది తక్కువసేపే అయినా కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశాడు. తద్వారా భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.