- Home
- Sports
- Cricket
- IPL: కేన్ మామ ఏందిది..? రూ. 14 కోట్లకు ఈ ఆట ఆడితే సన్ రైజర్స్ బతుకేంగాను..? ఇకనైైనా మేలుకోకుంటే కష్టమే..
IPL: కేన్ మామ ఏందిది..? రూ. 14 కోట్లకు ఈ ఆట ఆడితే సన్ రైజర్స్ బతుకేంగాను..? ఇకనైైనా మేలుకోకుంటే కష్టమే..
Kane Williamson: అనూహ్య పరిస్థితుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథిగా నియమితుడైన కేన్ విలియమ్సన్.. ఎందుకో అయిష్టంగానే ఐపీఎల్-15 ఆడుతున్నట్టు కనిపిస్తున్నది. సారథిగా ముందుండి నడిపించాల్సినోడే విఫలమవుతుంటే...

గతేడాది ఐపీఎల్ సీజన్ మధ్యలో డేవిడ్ వార్నర్ ను కాదని.. కేన్ విలియమ్సన్ ను సారథి చేసింది సన్ రైజర్స్ యాజమాన్యం. నాలుగేండ్లుగా జట్టుతోనే ఉంటున్న కేన్ మామ.. ఈ సీజన్ లో మాత్రం అత్యంత చెత్త ఆటతో అబాసుపాలవుతున్నాడు.
తాజా సీజన్ కు ముందు కొద్దిరోజుల క్రితం జరిగిన రిటెన్షన్ లో రూ. 14 కోట్ల భారీ ధర (అంతకుముందు నాలుగు సీజన్ల పాటు రూ. 3 కోట్లు మాత్రమే) పెట్టి అతడిని రిటైన్ చేసుకున్నది సన్ రైజర్స్. భారీ ధరతో పాటు సన్ రైజర్స్ ను నడిపించమని బాధ్యతలు కూడా అప్పజెప్పింది.
సారథి అనేవాడు తాను ముందుండి నడిపించాలి. తన వెనకాల వచ్చేవాళ్లకు ధైర్యమవ్వాలి. న్యూజిలాండ్ జట్టులో విలియమ్సన్ ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తాడు. కానీ ఐపీఎల్ కు వచ్చేసరికి ఏమైందో తెలియదు గానీ తానెందుకు ఆడుతున్నాడో తనకే క్లారిటీ లేకుండా ఉంది విలియమ్సన్ ఆట.
ఈ సీజన్ లో ప్రారంభం నుంచి కేన్ మామ చేసిన స్కోర్లివి.. 2, 16, 32, 57, 17, 3, 16, 5, 47, 4.. మొత్తం 10 మ్యాచుల్లో 199 పరుగులు. అందులో ముక్కీ మూలిగి ఒక్కటే హాప్ సెంచరీ.
ఐపీఎల్-14 ముగింపు తర్వాత న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ఆడిన కేన్ విలియమ్సన్.. అద్భుత ఆటతీరుతో జట్టును ఫైనల్ కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఫైనల్లో కేన్ మామ ఆట ఎప్పటికీ మరిచిపోలేనిది.
టీ20 క్లాసిక్ ఆటలలో ఒకటిగా ఆ ఇన్నింగ్స్ ను పరిగణించొచ్చు. అయితే ఆ సిరీస్ తర్వాత అతడు పెద్దగా ఆడలేదు. భారత్ లో పర్యటించిన కివీస్ జట్టులో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడినా కేన్ మాత్రం.. ఒక టెస్టులోనే కనిపించాడు. తర్వాత గాయం కారణంగా ముంబై టెస్టు ఆడలేదు.
మోచేతి గాయం కారణంగా అతడు ఇండియా సిరీస్ తర్వాత దాదాపు ఐదు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. అయితే ఐపీఎల్ కు సన్నద్ధమై వచ్చాడు. మరి అతడు ఎంత ఫిట్ గా ఉన్నాడో ఏమో గానీ.. తాజాగా కేన్ ఆటతీరు చూస్తే మాత్రం ఏదో అంటీముట్టని వ్యవహారం మాదిరిగానే అనిపిస్తున్నది.
ఒకవైపు క్రీజులో తనతో పాటు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడుతుంటే.. భారీగా పరుగులు చేస్తుంటే విలియమ్సన్ మాత్రం అందుకు విరుద్ధంగా చతికిలపడుతున్నాడు. ఒకప్పుడు డేవిడ్ వార్నర్ తో కలిసి హైదరాబాద్ కు భారీ విజయాలు అందించిన విలియమ్సన్.. ఇప్పుడు మాత్రం తన చెత్త ఆటతో విమర్శల పాలవుతున్నాడు.
గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో ఛేదించాల్సిన భారీ లక్ష్యం ముందున్నా.. 11 బంతులాడి నోర్త్జ్ బౌలింగ్ లో వికెట్ సమర్పించుకున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు కూడా కేన్ మామ.. తనలోని అసలైన ఆటగాడిని బయటకు తీయలేదనే చెప్పాలి.
ఈ సీజన్ లో తొలి రెండు మ్యాచులు ఓడిన తర్వాత వరుసగా ఐదు మ్యాచులు గెలిచిన సన్ రైజర్స్ కు అభిషేక్ శర్మతో పాటు మిడిలార్డర్ లో మార్క్రమ్, పూరన్ లు నిలకడగా రాణిస్తుండటంతో ఆ భారం కేన్ మీద పడటం లేదు.
కానీ ఇప్పుడు మళ్లీ సన్ రైజర్స్ అపజయాల బాటన నడుస్తున్నది. ఢిల్లీతో మ్యాచ్ లో ఓడి వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుని ప్లేఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడు హైదరాబాద్ ప్లేఆఫ్ చేరాలంటే తర్వాత జరుగబోయే నాలుగు మ్యాచులను గెలిచి తీరాలి. అలా గెలవాలంటే కేన్ మామ విజృంభించడం తప్పనిసరి. లేకుంటే 2021 పునరావృతం కాక తప్పదు.