- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ ఆడించేందుకు జస్ప్రిత్ బుమ్రా సర్జరీ వాయిదా... బీసీసీఐ నిర్లక్ష్యంతోనే స్టార్ బౌలర్..
ఐపీఎల్ ఆడించేందుకు జస్ప్రిత్ బుమ్రా సర్జరీ వాయిదా... బీసీసీఐ నిర్లక్ష్యంతోనే స్టార్ బౌలర్..
అప్పుడెప్పుడో గత ఏడాది ఆగస్టులో జరిగిన ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు జస్ప్రిత్ బుమ్రాకి గాయమైంది. ఆరు నెలలకు క్రికెట్‌కి దూరంగా ఉన్న జస్ప్రిత్ బుమ్రా, మరో ఆరు నెలల పాటు క్రికెట్ ఆడడం కష్టమేనని తేలిపోయింది. దీనికి కారణం బీసీసీఐ నిర్లక్ష్యమేనని తెలుస్తోంది...

Jasprit Bumrah
జస్ప్రిత్ బుమ్రా పూర్తిగా గాయం నుంచి కోలుకున్నాడని న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడతాడని ప్రకటించిన సెలక్టర్లు, మూడు రోజులకే అతన్ని ఆ సిరీస్ నుంచి తప్పించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి రెండు టెస్టుల్లో బుమ్రా ఆడతాడని ప్రచారం జరిగింది..
Jasprit Bumrah
అయితే రిస్క్ చేయడం ఇష్టం లేక బుమ్రాని స్వదేశంలో టెస్టు సిరీస్ నుంచి తప్పించింది బీసీసీఐ. నేరుగా ఐపీఎల్ 2023 సీజన్‌లో బుమ్రా ఆడతాడని అన్నారు. అయితే గాయంతో ఐపీఎల్ 2023తో పాటు ఆ తర్వాత జరిగే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కూడా ఆడడం లేదని తేలింది...
Jasprit Bumrah
ఆగస్టు 2023లో జరిగే ఆసియా కప్ టోర్నీతో పాటు అక్టోబర్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఆడడం కూడా అనుమానమేనని కొందరు అంచనా వేస్తున్నారు. ఇంత ఆలస్యం ఎందుకు అవుతోంది? జస్ప్రిత్ బుమ్రాకి అయిన గాయం అంత తీవ్రమైనదా?
‘జస్ప్రిత్ బుమ్రా ఏడాదిన్నరగా వెన్నెముక గాయంతో బాధపడుతున్నాడు. అతను తిరిగి గాయపడకుండా ఉండాలంటే సర్జరీ అవసరమని అప్పట్లోనే వైద్యులు సూచించారు. అయితే సర్జరీ చేయిస్తే కనీసం ఆరు నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉండాల్సి వస్తుంది.
ఐపీఎల్‌కి దూరమవుతాడనే ఉద్దేశంతో బీసీసీఐ, బుమ్రా సర్జరీని వాయిదా వేస్తూ వచ్చింది. ఐపీఎల్ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఆగారు. గాయం తిరగబెట్టింది. ఇప్పుడు సర్జరీ తప్పక చేయాల్సిన పరిస్థితి వచ్చింది...’ అని ఓ బీసీసీఐ అధికారి తెలియచేసినట్టు ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్ రాసుకొచ్చింది.
జస్ప్రిత్ బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో బౌలింగ్ శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే బుమ్రాకి ఇప్పుడే సర్జరీ అవసరం లేదని, అది కేవలం ఆప్షన్ మాత్రమేనని... రిస్క్ చేయడం ఇష్టం లేక ఇప్పుడు చేయించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
బుమ్రాకి సర్జరీ ఇప్పుడే చేయించాలా? ఐపీఎల్ తర్వాత చేయిస్తే బాగుంటుందా? అనే కోణంలో కూడా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం... ఆటగాళ్ల గాయాలను ఢీల్ చేసే విషయంలో జాతీయ క్రికెట్ అకాడమీ వ్యవహరిస్తున్న విధానాలపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి...
భువనేశ్వర్ కుమార్, వృద్ధిమాన్ సాహా, దీపక్ చాహార్, రవీంద్ర జడేజా కూడా ఎన్నో ఏళ్లుగా గాయాలతో సతమతమవుతున్నారు. వీరిలో చాలావరకూ ఒకే గాయం మళ్లీ మళ్లీ తిరగబెట్టడం వల్ల క్రికెట్‌కి దూరమయ్యారు. గాయం పూర్తిగా కోలుకోవడానికి ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎన్‌సీఏకి తెలీదా? తెలిసి గాయం పూర్తిగా మానకముందే ఎందుకు ఆడిస్తున్నారనేది అభిమానులకు అర్థం కావడం లేదు...