Jasprit Bumrah: టీమిండియాకు శుభవార్త.. త్వరగానే కోలుకుంటున్న పేస్ గుర్రం..
Jasprit Bumrah: గత నెలలో ఇంగ్లాండ్ తో ముగిసిన మూడు ఫార్మాట్ల సిరీస్ ల తర్వాత విరామం తీసుకున్న బుమ్రా.. వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలకు వెళ్లలేదు. ఇక కీలకమైన ఆసియా కప్ లో కూడా..

గాయం కారణంగా ఆసియా కప్ కు దూరమైన టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే జట్టుతో చేరనున్నాడు. టీ20 ప్రపంచకప్ కు అతడు ఆడేది అనుమానమే అన్న ఊహాగానాల నేపథ్యంలో బీసీసీఐ ఈ విషయంలో స్పష్టతనిచ్చింది.
గత నెలలో ఇంగ్లాండ్ తో ముగిసిన మూడు ఫార్మాట్ల సిరీస్ ల తర్వాత విరామం తీసుకున్న బుమ్రా.. వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలకు వెళ్లలేదు. ఇక కీలకమైన ఆసియా కప్ లో కూడా గాయం వల్ల బుమ్రా సేవలు భారత్ కు అందడం లేదు.
వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రాకు పాత గాయం కూడా తిరగబెట్టిందని.. దాని తీవ్రత కూడా ఎక్కువే ఉందని వార్తలు వచ్చాయి. వెన్నునొప్పి తీవ్రతను చూస్తే బుమ్రా కనీసం రెండు నెలల వరకు గ్రౌండ్ లోకి అడుగుపెట్టడం కష్టమేనన్న ఊహాగానాలూ వినిపించాయి. దీంతో అతడు ఆసియా కప్ తో పాటు టీ20 ప్రపంచకప్ లో ఆడేదీ అనుమానమే అని అభిమానులు భావించారు.
Image credit: Getty
కానీ బుమ్రా మాత్రం టీ20 ప్రపంచకప్ లో ఎలాగైనా ఆడేందుకు సంకల్పించుకున్నాడు. ఆ మేరకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో వారం రోజుల పాటు శ్రమించాడు. అక్కడ బుమ్రా గాయాన్ని పరిశీలించిన వైద్య బృందం.. అతడు త్వరగానే రికవరీ అవుతున్నట్టు గుర్తించింది. దీంతో అతడిని బెంగళూరు నుంచి ముంబైకి పంపింది. ప్రస్తుతం ముంబైలోని తన ఇంటి నుంచే బుమ్రా సాధన చేస్తున్నాడు.
బుమ్రా ఇంటి దగ్గర ఉన్నా అతడి ఆరోగ్యంపై బీసీసీఐ ఫిజియోలు నిత్యం సమీక్ష చేస్తున్నారు. ప్రస్తుతానికైతే బుమ్రా కోలుకున్నాడని.. అతడు సెప్టెంబర్ లో స్వదేశంలో జరుగబోయే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లలో ఆడతాడని బీసీసీఐ భావిస్తున్నది. ఆ రెండింటిలో ఏ ఒక్కదాంట్లో ఆడినా బుమ్రా.. టీ20 ప్రపంచకప్ లో ఆడటం పక్కానే.
Image credit: Getty
అయితే దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందిస్తూ.. ‘ప్రస్తుతానికి బుమ్రా కోలుకుంటున్నాడు. మా జట్టు ప్రధాన ఫిజియో నితిన్ పటేల్.. బెంగళూరులోని ఎన్సీఏ ఫిజియోలతో నిత్యం టచ్ లో ఉన్నాడు. ఎప్పటికప్పుడూ బుమ్రా ఆరోగ్య పరిస్థితిపై సమీక్షలు అందుతూనే ఉన్నాయి. బుమ్రా వచ్చే నెలలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లలో ఆడతాడనే నమ్మకం మాకున్నది. అయితే ఈ విషయంలో ఇప్పుడే ఇంకా ఏమీ చెప్పలేం..’ అని అన్నాడు.