హిట్ మ్యాన్ కు విశ్రాంతి టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. అలా అనుకోడు.. గంభీర్
Rohit Sharma: ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మ కీలక పర్యటనకు ముందు గాయంతో వైదొలగడం భారత జట్టుకు ఎదురుదెబ్బే అని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ సారథి రోహిత్ శర్మకు గాయం కారణంగా త్వరలో జరిగే దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి అతడు తప్పుకున్నాడు. హిట్ మ్యాన్ స్థానంలో దేశవాళీ తో పాటు ఇండియా-ఏలో అదరగొడుతున్న ప్రియాంక్ పంచల్ కు బీసీసీఐ అవకాశమిచ్చింది.
అయితే గాయం కారణంగా రోహిత్.. దక్షిణాఫ్రికా సిరీస్ కు దూరమవడం భారత జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ అని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఫామ్ లో ఉన్న హిట్ మ్యాన్ ఈ సిరీస్ కు దూరంగా ఉండాలని భావించి ఉండడని గంభీర్ చెప్పాడు.
గంభీర్ మాట్లాడుతూ.. ‘టీమిండియాకు ఇది భారీ ఎదురుదెబ్బ. రోహిత్ శర్మ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్ తో ముగిసిన టెస్టు సిరీస్ లో అతడు సెకండ్ హయ్యస్ట్ రన్ స్కోరర్ గా ఉన్నాడు. టెస్టుల్లో అతడు మంచి ఫామ్ ను కొనసాగిస్తున్నాడు.
అంతేగాక ఇటీవలే అతడు టెస్టులలో వైస్ కెప్టెన్ గా కూడా నియమితుడయ్యాడు. ఈ నేపథ్యంలో అతడికి గాయమవడం నిజంగా టీమిండియాకు భారీ షాకే..’ అని ఎన్డీటీవీతో మాట్లాడుతూ అన్నాడు.
సౌతాఫ్రికా సిరీస్‌కి ముందు భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ క్యాంపులో పాల్గొన్న రోహిత్ శర్మ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని టెస్టు జట్టు నుంచి తప్పించిన బీసీసీఐ.. ప్రియాంక్ పంచల్ ను ఎంపిక చేసింది.
ప్రియాంక్ పంచల్ ఎంట్రీ పై మాట్లాడుతూ.. ‘అతడికి మంచి అవకాశం.. ఈ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకుని దేశం గర్వపడే విధంగా ఆడాలి’ అని గంభీర్ ఆశించాడు.
ఇక ఆగస్టు-సెప్టెంబర్ లో జరిగిన ఇంగ్లాండ్ పర్యటనలో రోహిత్ శర్మ ఓ సెంచరీతో పాటు 368 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లోనే అతడు టెస్టులలో విదేశీ గడ్డమీద సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు.