- Home
- Sports
- Cricket
- గిల్‌ను ఇప్పుడే వారితో పోల్చడం సరికాదు : టీమిండియా మాజీ కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
గిల్‌ను ఇప్పుడే వారితో పోల్చడం సరికాదు : టీమిండియా మాజీ కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Shubman Gill: టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ ఫార్మాట్లతో సంబంధం లేకుండా తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు బాదుతున్న గిల్‌ను.. భారత క్రికెట్ ఆశాకిరణంగా భావిస్తున్నారు అభిమానులు.

ఈ ఏడాది ఫార్మాట్, టోర్నీతో సంబంధం లేకుండా సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నాడు టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్. శ్రీలంకతో వన్డేలలో మొదలైన అతడి వీరవిహారం ఇటీవలే ముగిసిన ఐపీఎల్ ఫైనల్ వరకూ నిరాటంకంగా సాగుతోంది. త్వరలో మొదలయ్యే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో కూడా గిల్ పై భారీ అంచనాలే ఉన్నాయి.
అయితే గిల్ ఆట చూసి టీమిండియా ఫ్యాన్స్ అతడిని భారత క్రికెట్ లో సచిన్, కోహ్లీ తర్వాత ఆ స్థాయి ఆటగాడు అవుతాడని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఇదే విషయమై గుజరాత్ టైటాన్స్ మెంటార్, టీమిండియాకు 2011లో వన్డే వరల్డ్ కప్ అందించిన జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరించిన గ్యారీ కిర్‌స్టెన్ స్పందించాడు. గిల్ ను ఇప్పుడే ఆ దిగ్గజ క్రికెటర్లతో పోల్చడం సరికాదని అన్నాడు.
Image credit: PTI
క్రిక్ బజ్ కు ఇచ్చిన ఇంటర్వ్యలో కిర్‌స్టెన్ మాట్లాడుతూ.. ‘గిల్ చాలా యంగ్ ప్లేయర్. అద్భుతమైన నైపుణ్యం, ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా ఉండాలన్న పట్టుదలతో ఉన్న యువ ఆటగాడు. కానీ అతడి ప్రయాణంలో ఇప్పుడే గిల్ ను సచిన్, కోహ్లీలతో పోల్చడం సరికాదు. గిల్ ఇంకా చాలా చిన్నవాడు.
భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో విజయవంతంగా ఆడగల సామర్థ్యం అతనికి ఉందని నేను నమ్ముతున్నా. ఈ రోజుల్లో.. మరీ ముఖ్యంగా టీ20 క్రికెట్ వేగంగా పురోగమిస్తున్నందున ఇలాంటి ఆటగాడిని, ప్రదర్శనలను తరుచుగా చూడటం సాధ్యమయ్యే పనికాదు..’ అని అన్నాడు.
గతేడాదితో పోలిస్తే ఈ సీజన్ లో గిల్ విశ్వాసం పెరిగిందని కిర్‌స్టెన్ చెప్పాడు. గేమ్‌లకు ఎలా సిద్ధం అవ్వాలనే దాని గురించి అతడికి స్పష్టమైన అవగాహన ఉందన్నాడు. ఈ సీజన్‌లో అతను ప్రతి మ్యాచ్‌లో తన బలాలు తెలుసుకుని వాటిని సరైన సమయంలో ఎలా ఉపయోగించాలో అద్భుతంగా అర్థం చేసుకున్నాడని కొనియాడాడు.
గిల్ కూడా కెప్టెన్సీ మెటీరియలే అన్న కిర్‌స్టెన్.. రాబోయే రోజుల్లో నాయకుడిగా ఎదిగే అవకాశం ఉందని తెలిపాడు. గిల్‌కు ఆటపై మంచి అవగాహన ఉందని తన సహచరులతో బాగా కలిసిపోతాడని చెప్పాడు. అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు గొప్ప ఆటగాడిగా ఎదగడానికి శుభ్‌మన్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని, అయితే భవిష్యత్ లో అతడికి ఎదురయ్యే సవాళ్లు, అడ్డంకులను ఎలా దాటుతున్నాడనేదానిపై అతడి కెరీర్ ఆధారపడి ఉందని తెలిపాడు.