- Home
- Sports
- Cricket
- ఇదే మనకు సువర్ణావకాశం.. అస్సలు మిస్ చేసుకోవద్దు.. సౌతాఫ్రికా టూర్ కు ముందు టీమిండియాకు మాజీ క్రికెటర్ సూచన
ఇదే మనకు సువర్ణావకాశం.. అస్సలు మిస్ చేసుకోవద్దు.. సౌతాఫ్రికా టూర్ కు ముందు టీమిండియాకు మాజీ క్రికెటర్ సూచన
India Tour Of South Africa: దక్షిణాఫ్రికా లో సఫారీలను ఓడించడం అంత తేలికేమీ కాదు. అయితే గత కొద్దిరోజులుగా ఆ జట్టు ప్రదర్శనతో పాటు అనుభవలేమీ దక్షిణాఫ్రికాను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో...!

టెస్టు క్రికెట్ ఆడే దేశాలన్నింటిపై వారి దేశంలోనే సిరీస్ విజయాలు సాధించిన టీమిండియా.. దక్షిణాఫ్రికాపై మాత్రం ఇంతవరకూ ఆ ముచ్చట తీర్చుకోలేదు. దీంతో ఈసారి సౌతాఫ్రికా లో సఫారీలను ఓడించి సిరీస్ చేజిక్కించుకోవాలని భారత జట్టు భావిస్తున్నది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సబాకరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా గడ్డ మీద ఆ జట్టును ఓడించడానికి టీమిండియాకు ఇది సువర్ణావకాశమని అన్నాడు.
కరీం మాట్లాడుతూ.. ‘వచ్చే టెస్టు సిరీస్ లో భారత్ 2-0తో గానీ లేదా 2-1 తేడాతో గానీ గెలుస్తుంది. ప్రస్తుతం ఆ జట్టు టెస్టులలో పెద్దగా రాణించడం లేదు. అంతేగాక కీలక ఆటగాళ్లంతా దూరమయ్యారు. ఇది భారత్ కు కలిసొచ్చే అంశం..
ఇక వన్డేలలో టీమిండియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ప్రస్తుత జట్టు అత్యుత్తమమైనది. టీమ్ లో అనుభవజ్ఞులు ఉన్నారు. అంతేగాక యువ ఆటగాళ్లతో భారత జట్టు బెంచ్ కూడా పటిష్టంగా ఉంది..’ అని అన్నాడు.
దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు ఆ జట్టుతో ఏడు టెస్టు సిరీస్ లు ఆడిన టీమిండియా.. ఒక్కటి కూడా గెలవలేదు. ఆరింటిలో ఓడిపోగా.. 2010-11 లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ లో మాత్రం డ్రా చేసుకుంది.
2010-11 లో భారత జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో దక్షిణాఫ్రికా కు వెళ్లిన టీమిండియా.. రెండు టెస్టుల సిరీస్ ను 1-1తో డ్రా చేసుకుంది. ఇదే విషయాన్ని కరీం గుర్తు చేశాడు.
ఇదిలాఉండగా.. కరీం చెప్పినట్టు దక్షిణాఫ్రికాలో సఫారీలను ఓడించడానికి భారత్ కు ఇదే సువర్ణావకాశం. ఆ జట్టు దిగ్గజాలుగా ఉన్న షాన్ పొలాక్, జాక్వస్ కలిస్, హెర్షలీ గిబ్స్, మార్క్ బౌచర్, అలెన్ డొనాల్డ్ ల తర్వాత జట్టులోకి వచ్చిన డివిలియర్స్, డేల్ స్టెయిన్, ఎన్తిని వంటి ఆటగాళ్లు రిటైర్ అయ్యాక ఆ జట్టు అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా రాణించింది లేదు.
ఇక రాబోయే సిరీస్ లో వికెట్ క్వింటన్ డికాక్, బవుమా, కెప్టెన్ డీన్ ఎల్గర్, పేసర్ కగిసొ రబాడా లకు మినహా భారత్ తో ఆడిన అనుభవం తక్కువ. వీరిలో కీలక ఆటగాడైన డికాక్ కూడా తొలి టెస్టుకే అందుబాటులో ఉంటాడు. చివరి రెండు టెస్టులకు అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇది దక్షిణాఫ్రికాకు పెద్ద ఎదురుదెబ్బే.
సఫారీలను ఓడించడానికి ఇన్ని అనుకూలతలు ఉన్న టీమిండియా.. ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. డిసెంబర్ 26న సెంచూరీయన్ వేదికగా తొలి టెస్టు జరుగుతుంది.