- Home
- Sports
- Cricket
- చెప్పడానికి మాటల్లేవ్.. పాక్ పై కోహ్లీ ఆడిన ఆ షాట్ చరిత్రలో నిలిచిపోతుంది.. పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
చెప్పడానికి మాటల్లేవ్.. పాక్ పై కోహ్లీ ఆడిన ఆ షాట్ చరిత్రలో నిలిచిపోతుంది.. పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
T20 World Cup 2022: భారత జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ ప్రారంభంలో టీమిండియా ఆడిన తొలి మ్యాచ్ పాకిస్తాన్ తో తన విశ్వరూపం చూపాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య గతనెల 23న మెల్‌బోర్న్ లో ముగిసిన తొలి మ్యాచ్ లో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత జట్టు పాకిస్తాన్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్య ఛేదనలో 31 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ.. హార్ధిక్ పాండ్యాతో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పడమే గాక చివరి వరకూ క్రీజులో నిలిచి భారత్ కు మరుపురాని విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో కోహ్లీ.. హరీస్ రౌఫ్ వేసిన 19వ ఓవర్లో కొట్టిన రెండు సిక్సర్లు మ్యాచ్ గమనాన్నే మార్చేశాయి.
160 పరుగుల లక్ష్యంలో భారత్ 18 ఓవర్లలో చేసింది 4 వికెట్లకు 129. మరో రెండు ఓవర్లలో 31 పరుగులు కావలి. ఆ సమయంలో బాబర్.. హరీస్ రౌఫ్ కు బంతినిచ్చాడు. ఆ ఓవర్లో తొలి నాలుగు బంతులలో నాలుగు పరుగులే వచ్చాయి. కానీ ఐదో బంతికి కోహ్లీ సిక్సర్ బాదాడు. ఆరో బంతిదీ అదే దారి. వరుసగా రెండు సిక్సర్లు రావడంతో భారత టార్గెట్ చివరి ఓవర్లో 16 పరుగులకు మారింది.
అయితే అంత ఒత్తిడిలో కూడా కోహ్లీ.. హరీస్ బౌలింగ్ లో రెండు భారీ సిక్సర్లు కొట్టడం విశేషం. తొలి సిక్సర్ ను స్ట్రెయిట్ సిక్సర్ గా మలిచిన కోహ్లీ.. తర్వాత బంతిని ఫైన్ లెగ్ మీదుగా కొట్టిన సిక్సర్ మాత్రం క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ షాట్ గా నిలిచిపోతుందని ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ అన్నాడు.
పాంటింగ్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసి ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్, చాలాకాలం గుర్తొచ్చే షాట్ గా నిలిచిపోతుందని నేను భావిస్తున్నా. పాకిస్తాన్ గేమ్ ప్లాన్ ను ఊహించిన కోహ్లీ తన గేమ్ ను సెట్ చేసుకున్నాడు. పరిస్థితులు అతడికి అనుకూలించకున్నా పోరాడాడు. వాస్తవానికి హరీస్ రౌఫ్ వేసిన ఓవర్లో ఫైన్ లెగ్ మీదుగా కొట్టిన సిక్సర్ మామూలుది కాదు. నేనైతే అలా ఆడలేను.
ఆ షాట్ ఆడేముందు కోహ్లీ బ్యాక్ ఫూట్ తీసుకోలేదు. అది బ్యాక్ ఫుట్ లెంగ్త్ బాల్ అయినా విరాట్ షాట్ ఆడేందుకు రెడీ గా ఉండి.. నార్మల్ ఫుట్ వర్క్ తోనే ఆ షాట్ ఆడాడు. ఇలా షాట్ ఆడటం కష్టం. దీనికి ఫుట్ వర్క్ ఒక్కటే సరిపోదు. ఫిట్నెస్ కూడా కావాలి. అది కోహ్లీకి కావాల్సినంత ఉంది. ఇటువంటి షాట్లు ఆడటం కోహ్లీకే సాధ్యం..’ అని తెలిపాడు.