అలా అయితే సెలక్షన్ కమిటీలో మెడికల్ ఎక్స్‌పర్ట్స్‌ను పెట్టుకోండి.. బీసీసీఐపై సన్నీ సెటైర్లు
టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు సెమీస్ ఓటమి తర్వాత సుమారు రెండు నెలలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవలే ముంబైలో రివ్యూ మీటింగ్ నిర్వహించింది. ఈ మీటింగ్ లోనే ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ గురించి కూడా చర్చించారు.
రివ్యూ మీటింగ్ లో భాగంగానే గతంలో భారత క్రికెట్ జట్టు సెలక్షన్స్ లో భాగమైన యో యో టెస్టును తిరిగి తీసుకురావాలని నిర్ణయించారు బోర్డు పెద్దలు. గత ఏడాదిన్నర కాలంగా జట్టుకు వరుస గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో కీలక టోర్నీలకు సీనియర్ ప్లేయర్లు దూరమయ్యారు. దీంతో ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలలో భారత్ దారుణ వైఫల్యం మూటగట్టుకోవాల్సి వచ్చింది.
అయితే ఆటగాళ్ల సెలక్షన్ కు తప్పనిసరి చేయనున్న యో యో టెస్టుపై తాజాగా టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యో యో టెస్టు, డెక్సా టెస్టుకు బదులు జట్టులో ఓ మెడికల్ ఎక్స్‌పర్ట్ ను పెట్టుకోవాలని సూచించాడు. అప్పుడు ఎవరు ఫిట్ గా ఉన్నారు..? ఏ ఆటగాడికి గాయాలయ్యాయి..? అన్న విషయం సెలక్టర్లకు తెలిసిపోతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
తన కాలమ్ ‘మిడ్ డే’లో ఇదే విషయమై ఆయన ఓ వ్యాసం రాశారు. ‘జట్టులోకి రావాలంటే ఫిట్నెస్ ముఖ్యమే. అది వ్యక్తిగత విషయం. అందరూ ఒకే విధమైన ఫిట్నస్ కలిగి ఉండటమన్నది అర్థం లేని వాదన. ఫాస్ట్ బౌలర్లకు ఉండే ఫిట్నెస్ స్పిన్నర్లకు ఉండదు. వికెట్ కీపర్లకు ఉండే ఫిట్నెస్ బ్యాటర్లకు ఉండదు. అందరినీ ఒకే గాటిన కట్టేయడం ఎలా..?
బీసీసీఐ ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. పబ్లిక్ డొమైన్ లో వాటిని నిర్వహించాలి. మీడియా ను పిలిచి ఎవరికి ఎంత ఫిట్నెస్ ఉందనేది ప్రకటించాలి. ప్రతీ ప్లేయర్ ‘యో యో’ పాస్ అయ్యాడా లేక ‘నో నో’ అంటున్నాడా..? అన్నది చెప్పాలి.
ఇక కొత్త సెలక్షన్ కమిటీ కోసం బీసీసీఐ నియమించిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఇటీవలే వారిని ఇంటర్వ్యూలు చేసి కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించింది. కానీ వారిలో ఒక్కరు కూడా బయో మెకానిక్స్ ఎక్స్‌పర్ట్ లేదా బాడీ సైన్స్ గురించి తెలిసిన వాళ్లు లేరు.
మరి ఇప్పుడు టీమిండియాకు అర్హత సాధించాలంటే ఫిట్నెస్, యో యో టెస్టు, డెక్సా టెస్టు ముఖ్యం కాబట్టి సెలక్షన్ కమిటీలో మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ను కలిగి ఉంటే మంచిది. మాజీ క్రికెటర్ల కంటే వైద్య నిపుణులను తీసుకుంటే ఎవరు ఫిట్ గా ఉన్నారు..? ఎవరు ఆడతారు..? అన్నది వాళ్లు తేల్చుతారు..’అని రాసుకొచ్చాడు.