- Home
- Sports
- Cricket
- Shreyas Iyer: ఢిల్లీని వీడనున్న శ్రేయస్ అయ్యర్..! ఆ రెండు జట్లలో ఏదో ఒకదానికి వెళ్లే ఛాన్స్..
Shreyas Iyer: ఢిల్లీని వీడనున్న శ్రేయస్ అయ్యర్..! ఆ రెండు జట్లలో ఏదో ఒకదానికి వెళ్లే ఛాన్స్..
IPL 2022: 2015లో ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన అయ్యర్.. 2018 లో గౌతం గంభీర్ అర్థాంతరంగా కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో ఆ జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టాడు.

Shreyas Iyer
ఇటీవలే ముగిసిన ఐపీఎల్-14 (IPL) సీజన్ లో లీగ్ దశలో టేబుల్ టాపర్ గా నిలిచినా ప్లేఆఫ్స్ లో అనూహ్యంగా ఓటమిపాలైన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టుకు మరో ఊహించని షాక్. నాలుగేండ్ల పాటు ఆ జట్టును నడిపించిన ఢిల్లీ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer).. క్యాపిటల్స్ ను వీడనున్నట్టు తెలుస్తున్నది.
ఐపీఎల్-15 (IPL-15) కోసం త్వరలోనే మెగా వేలం జరుగనున్న నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఐపీఎల్ లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రేయస్.. వచ్చే సీజన్ లో ఆ జట్టును వీడి కొత్త జట్ల వైపు చూస్తున్నాడని సమాచారం.
2015లో ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన అయ్యర్.. 2018 లో గౌతం గంభీర్ అర్థాంతరంగా కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో ఆ జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టాడు.
అయ్యర్ సారథ్యంలో ఢిల్లీ జట్టు రెండు సార్లు ప్లేఆఫ్స్ చేరుకోగా.. 2020 ఎడిషన్ లో ఫైనల్ కు చేరింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ఇక ఐపీఎల్-14 కు ముందు ఇంగ్లండ్ తో భారత్ లో జరిగిన వన్డే సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ కు గాయమైన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ యాజమాన్యం.. అతడి స్థానాన్ని పంత్ తో భర్తీ చేసింది.
తొలి దశ ఐపీఎల్ కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. రెండో అంచె ప్రారంభమయ్యేనాటికి అయ్యర్.. గాయం నుంచి కోలుకుని ఫిట్ అయ్యాడు. కానీ ఢిల్లీ మాత్రం మిగిలిన మ్యాచ్ లకు కూడా పంత్ నే కొనసాగించింది.
ఇదే విషయమై అయ్యర్.. జట్టు యాజమాన్యంతో అసంతృప్తితో ఉన్నాడని వార్తలొచ్చాయి. అయితే అతడు దీనిని ఖండించాడు. ఫ్రాంచైజీ నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని చెప్పుకొచ్చాడు.
ఇక ఐపీఎల్-14 లో రిషబ్ పంత్ కూడా ఢిల్లీని బాగానే నడిపించాడు. ప్లే ఆఫ్స్ లో రెండు మ్యాచ్ లు మినహా.. టోర్నీ ఆధ్యంతం ఆ జట్టు ప్రదర్శన అద్భుతంగా సాగింది. దీంతో వచ్చే సీజన్ కు కూడా పంత్ కే సారథ్య బాద్యతలు అప్పజెప్పాలని ఢిల్లీ భావిస్తోంది.
ఢిల్లీ నిర్ణయంతో శ్రేయస్ కూడా తాను జట్టును వీడాలని భావిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. సారథ్య బాధ్యతల మీద ఆసక్తి చూపుతున్న అతడు.. వచ్చే ఏడాది రెండు కొత్త జట్లలో ఏదో ఒకదానికి కెప్టెన్ గా వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే లక్నో, అహ్మదాబాద్ లు అయ్యర్ ను తీసుకుంటాయో లేదో చూడాలి.
లక్నో, అహ్మదాబాద్ తో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు కూడా సారథులు లేరు. హైదరాబాద్ కెప్టెన్ వార్నర్.. వ్యక్తిగత కారణాలతో జట్టును వీడాడు. కేన్ విలియమ్సన్ తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అతడు కూడా వచ్చే ఏడాది జట్టులో ఉంటాడో లేదోననో అనుమానాలున్నాయి. ఇక బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంతకుముందే సారథిగా ఇదే తన చివరి ఐపీఎల్ అని ప్రకటించి తప్పుకున్న విషయం తెలిసిందే.
ఈ రెండు జట్లు కొత్త కెప్టెన్ ను ఇంతవరకు ప్రకటించలేదు. అయితే లక్నో, అహ్మదాబాద్ కాకుంటే.. హైదరాబాద్, బెంగళూరు కైనా కెప్టెన్ కావాలని అయ్యర్ ఆశిస్తున్నాడట. కొద్దిరోజుల్లో దీనిపై స్పష్టత రానున్నది.