- Home
- Sports
- Cricket
- IPL2022 Auction: నేను ఆర్సీబీకి ఎంపికయ్యాక కోహ్లి మెసేజ్ చేశాడు.. అలా అంటాడని ఊహించలేదు : హర్షల్ పటేల్
IPL2022 Auction: నేను ఆర్సీబీకి ఎంపికయ్యాక కోహ్లి మెసేజ్ చేశాడు.. అలా అంటాడని ఊహించలేదు : హర్షల్ పటేల్
Harshal Patel: గతేడాది ఐపీఎల్ సీజన్ లో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న హర్షల్ పటేల్ ను ఈ సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసుకోలేదు. కానీ..

భారత జట్టులోకి లేటు వయసులో వచ్చినా సత్తా ఉన్న క్రికెటర్ గా నిరూపించుకున్నాడు హర్షల్ పటేల్. టీమిండియా తరఫున ఆడింది రెండు టీ20లే అయినా భవిష్యత్ పై నమ్మకం కలిగించేలా చేశాడు ఈ గుజరాత్ మీడియం పేసర్.
భారత జట్టులోకి రాకముందు అతడు రంజీలు ఆడినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ గతేడాది ఐపీఎల్ లో అతడి ప్రదర్శన.. హర్షల్ పటేల్ జీవితాన్ని మలుపుతిప్పింది.
గతంలో మూడు సీజన్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన హర్షల్.. 2021 ఐపీఎల్ సీజన్ అతడికి లైఫ్ ఇచ్చింది. ఆ సీజన్ కు ముందు నిర్వహించిన వేలంలో హర్షల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కనీస ధరకు కొనుగోలు చేసింది.
2021 సీజన్ లో హర్షల్ పటేల్ మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. గత సీజన్ లో ఏకంగా 32 వికెట్లు తీసి ఐపీఎల్ లో ఒకే సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ డ్వేన్ బ్రావో సరసన నిలిచాడు.
అయితే గత సీజన్ కు ప్రారంభానికి ముందు అప్పటి ఆర్సీబీ సారథి కోహ్లి తనను ఎంతో ఎంకరేజ్ చేశాడని హర్షల్ అన్నాడు. ఐపీఎల్ వేలానికి ముందు అతడు ఓ స్పోర్ట్స్ ఛానెల్ తో ముచ్చటించాడు.
హర్షల్ పటేల్ మాట్లాడుతూ... ‘ఐపీఎల్ లో జరిగేదేది వ్యక్తిగతంగా తీసుకోకూడదని నేను నమ్ముతాను. ఒక ఫ్రాంచైజీ నిన్ను దక్కించుకున్నా.. వద్దని వదిలేసినా అది నీ మెరుగైన ప్రదర్శన చూసే తప్ప వ్యక్తిగతంగానైతే కాదు. ఒకవేళ నువ్వు బాగా ఆడితే వాళ్లు నీకు అవకాశాలిస్తారు. లేదంటే నిన్ను పట్టించుకోరు.
నేను గొప్ప అవకాశం కోసం వేచి చూశాను. అయితే ప్రతిసారి ఏదో అనిశ్చితి. కానీ మీమీద మీకు నమ్మకం ఉండాలి. నీ జట్టు విజయంలో నీ పాత్ర ఎంతో చూసుకోవాలి.
గతేడాదికి ముందు కూడా నేను ఇదే పరిస్థితుల్లో ఉన్నాను. సరిగ్గా అదే సమయంలో ఢిల్లీ నుంచి ఆర్సీబీకి వచ్చాను. వేలంలో నేను ఆర్సీబీకి ఎంపికయ్యాక నాకు అప్పటి సారథి విరాట్ కోహ్లి మెసేజ్ చేశాడు. ఏంటా అని నేను చూసుకునేసరికి.. ‘నువ్వు వచ్చే ఐపీఎల్ లో మా జట్టు తరఫున అన్ని మ్యాచులు ఆడబోతున్నావ్..’ అని ఉంది..
దాంతో నా ఆనందానికి అవధుల్లేవు.. కోహ్లి చేసిన మెసేజ్ నాలో పాజిటివ్ దృక్పథాన్ని పెంచింది. అది నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. ఆ తర్వాత కోహ్లి నాకు ప్రతి మ్యాచులో బౌలింగ్ చేసే అవకాశమిచ్చాడు..’ అని హర్షల్ తెలిపాడు.
గత సీజన్ లో ఆర్సీబీ తరఫున ఆడిన హర్షల్ ను ఈసారి ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు. కానీ త్వరలో జరిగే ఐపీఎల్ వేలంలో అతడిని దక్కించుకోవాలని చూస్తున్నది. ఈ ఏడాది ఆర్సీబీతో పాటు అతడిపై మరికొన్ని జట్లు కూడా కన్నేశాయి.