IPL 2024: పాండ్యాకు షాకిచ్చిన కేఎల్ రాహుల్ టీమ్.. !
KL Rahul - Nicholas Pooran : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 కోసం లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కొత్త వైస్ కెప్టెన్‌ని ప్రకటించింది. లక్నో టీమ్ కు కేఎల్ రాహుల్ కెప్టెన్ కాగా, అతను అందుబాటులోలేని సమయంలో కృనాల్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహించేవాడు.
Krunal Pandya, KL Rahul, Nicholas Pooran
IPL 2024, Lucknow Super Giants: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐసీఎల్2024) కు సర్వం సిద్ధమవుతోంది. ఈ మెగా క్రికెట్ లీగ్ మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించలేదు. ప్రస్తుతం 21 మ్యాచ్‌ల షెడ్యూల్ ను ప్రకటించగా, తొలి మ్యాచ్ లో ఎంఎస్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఇదిలావుండగా, ఈ మెగా టోర్నీకి ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పెద్ద మార్పులు జరిగాయి. కృనాల్ పాండ్యాకు షాకిస్తూ ఆ టీమ్ కొత్త వైస్ కెప్టెన్ ప్రకటించింది. వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్ ను ఐపీఎల్ 2024 సీజన్‌కు వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది.
Nicholas Pooran
కొత్త వైస్ కెప్టెన్ ఎంపిక గురించి లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తమ సోషల్ మీడియాలో హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. లక్నో టీమ్ తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ.. కొత్త వైస్ కెప్టెన్ ఫొటోను పంచుకుంది. అందులో నికోలస్ పురాన్, కెప్టెన్ కేఎల్ రాహుల్ ఉన్నారు. పురాన్ పేరు రాసి ఉన్న జెర్సీని ఇద్దరు ప్లేయర్లు పట్టుకుని కనిపించారు. ఈ పోస్ట్ క్యాప్షన్ లో 'కేఎల్ రాహుల్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్). ఈ సీజన్ ఇప్పటికే ప్రత్యేకంగా కనిపిస్తోందని' పేర్కొంది.
కృనాల్ పాండ్యాకు షాక్..
లక్నో టీమ్ కృనాల్ పాండ్యాను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించింది. హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా గత సీజన్‌లో చాలా సందర్భాలలో లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్ 2023లో, కృనాల్ 6 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు. గాయం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్‌కు కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. అప్పటి నుంచి కృనాల్ పాండ్యాకు జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి చవిచూసిన లక్నో టీమ్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.
సూపర్ ఇన్నింగ్స్ లతో అదరగొట్టిన నికోలస్ పూరాన్
ఐపీఎల్‌లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ నికోలస్ పురాన్ స్ట్రైక్ రేట్ 150+ ఉంది. ఐపీఎల్ 2023లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత ఐపీఎల్ సీజన్‌లో నికోలస్ పూరాన్ 15 మ్యాచ్‌ల్లో 62 సగటుతో 358 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అతని స్ట్రైక్ రేట్ 172.95. ఇందులో 2 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. మొత్తంగా ఐపీఎల్ లో 62 మ్యాచ్‌లు ఆడిన నికోలస్ పూరాన్ 1270 పరుగులు చేశాడు. అతని 156.79 స్ట్రైక్ రేట్ వుండగా, 6 అర్ధ సెంచరీలు సాధించాడు.