- Home
- Sports
- Cricket
- చిన్నస్వామిలో తప్ప వేరే స్టేడియంలో ఆడవా కోహ్లీ..? జైపూర్‌లోనూ టుక్ టుక్ అకాడమీ ఆటే!
చిన్నస్వామిలో తప్ప వేరే స్టేడియంలో ఆడవా కోహ్లీ..? జైపూర్‌లోనూ టుక్ టుక్ అకాడమీ ఆటే!
IPL 2023: ఐపీఎల్ -16 లో విరాట్ కోహ్లీ 12 ఇన్నింగ్స్ లలో 438 పరుగులు చేసి జోరు మీదే కనిపిస్తున్నాడు. కానీ ఇందులో మెజారిటీ పరుగులు ఆర్సీబీ సొంత గ్రౌండ్ చిన్నస్వామిలో చేసినవే.

గత సీజన్ లో కనీసం క్రీజులో నిలబడేందుకే నానా తంటాలు పడ్డ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్ల ఈ సీజన్ లో ఫర్వాలేదనిపిస్తున్నాడు. అయితే కోహ్లీ ఈ సీజన్ లో ఆర్సీబీ హోంగ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు) లో తప్ప మిగతా చోట్ల దారుణ వైఫల్యాలు మూటగట్టుకుంటున్నాడు.
ఈ సీజన్ లో కోహ్లీ 12 మ్యాచ్ లలో 12 ఇన్నింగ్స్ ఆడి ద 39.82 సగటుతో 438 పరుగులు చేశాడు. ఇందులో మెజారిటీ భాగం (253) చిన్నస్వామి స్టేడియంలో చేసినవే. ఐపీఎల్ -16 లో భాగంగా చిన్నస్వామిలో ఆరు మ్యాచ్ లు ఆడాడు కోహ్లీ.
చిన్నస్వామి బయట ఆరు మ్యాచ్ లలో కలిపి 185 పరుగులు చేశాడు విరాట్. ఈ సీజన్ ఆరంభంలో ముంబై తో 49 బంతులలో 82 పరుగులతో అద్భుతమైన ఆరంభాన్నిచ్చిన కోహ్లీ.. తర్వాత కోల్కతా లో 18 బంతుల్లో 21 పరుగులే చేశాడు. మళ్లీ చిన్నస్వామిలోనే లక్నోతో 44 బంతుల్లో 60, ఢిల్లీతో 34 బంతుల్లో 50 పరుగులు చేశాడు. కానీ చెన్నైతో మ్యాచ్ లో ఆరు పరుగులే చేశాడు.
మొహాలీలో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ తర్వాత రాజస్తాన్ తో చిన్నస్వామి లోనే జరిగిన మ్యాచ్ లో డకౌట్ అయ్యాడ. మళ్లీ ఇదే వేదికపై కోల్కతాతో జరిగిన పోరులో 37 బంతుల్లోనే ద 54 పరుగులు చేశాడు. లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో పోరులో 30 బంతుల్లో 31 పరుగులే చేసిన కోహ్లీ.. ఢిల్లీలో వార్నర్ సేనతో పోరులో 46 బంతుల్లో 55 పరుగులు చేశాడు.
ఇటీవలే ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో భాగంగా వాంఖెడే లో నాలుగు బంతులు ఆడి ఒక్క పరుగే చేసిన కోహ్లీ.. తాజాగా జైపూర్ లో కూడా 19 బంతుల్లో 18 పరుగులే చేశాడు. ఈ 12 ఇన్నింగ్స్ లను చూస్తే చిన్నస్వామి స్టేడియంలో మాత్రమే కోహ్లీ ధాటగా ఆడుతున్నాడు. మిగిలిన వేదికల్లో క్రీజులో నిలదొక్కుకోవడానికి ఎక్కువ బంతులను తీసుకుంటున్నాడు. ఢిల్లీ, మొహాలీలో అర్థ సెంచరీలతో రాణించినా ఆ మ్యాచ్ లలో బాల్ కు ఒక రన్ అన్న రేంజ్ లో ఆడి విమర్శల పాలయ్యాడు.
చిన్నస్వామిలో దూకుడుగా ఆడుతున్న విరాట్.. బయట స్టేడియాలలో మాత్రం టుక్ టుక్ అకాడమీ ఆట ఆడుతున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్లు వాపోతున్నారు. ఐపీఎల్ లో టెస్టు మ్యాచ్ తరహాలో ఆడేవారికి ట్విటర్ లో నెటిజన్లు ఈ ‘టుక్ టుక్ అకాడమీ’ అనే ట్యాగ్ తగిలించి ట్రోల్స్ చేస్తున్నారు.