- Home
- Sports
- Cricket
- రాయుడూ.. నువ్వు వచ్చేదే ఇంపాక్ట్ ప్లేయర్‌గా.. అదీ సరిగా చేయకుంటే ఎలా..? అంబటిపై గవాస్కర్ గరం గరం
రాయుడూ.. నువ్వు వచ్చేదే ఇంపాక్ట్ ప్లేయర్‌గా.. అదీ సరిగా చేయకుంటే ఎలా..? అంబటిపై గవాస్కర్ గరం గరం
IPL 2023: ఐపీఎల్ -16లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అంబటి రాయుడు ఆటతీరుపై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ మిడిలార్డర్ బ్యాటర్ అంబటి రాయుడు ఈ సీజన్ లో చెత్త ప్రదర్శనలతో విమర్శల పాలవుతున్నాడు. ఈ సీజన్ లో అతడు చాలావరకు ఇంపాక్ట్ ప్లేయర్ గానే బరిలోకి దిగుతున్నాడు. చెన్నై అతడిని ప్యూర్ బ్యాటర్ గా మాత్రమే వాడుతోంది.
కానీ దానికి కూడా రాయుడు న్యాయం చేయలేకపోతున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు 8 మ్యాచ్ లలో 8 ఇన్నింగ్స్ లలోనూ బ్యాటింగ్ కు వచ్చి 16.60 సగటుతో 83 పరుగులు మాత్రమే చేశాడు. 14 ఏండ్ల రాయుడి ఐపీఎల్ కెరీర్ లో ఇంత తక్కువ సగటు నమోదవడం ఇదే ప్రథమం.
ఇక రాజస్తాన్ రాయల్స్ తో నిన్న జైపూర్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో కూడా రాయుడు మరోసారి నిష్క్రమించాడు. అశ్విన్ వేసిన 11వ ఓవర్లో రెండో బాల్ కే అజింక్యా రహానే ఔట్ కాగా మరో రెండు బంతులకే రాయుడు కూడా భారీ షాట్ ఆడి జేసన్ హోల్డర్ చేతికి చిక్కాడు. తద్వారా అతడు డకౌట్ అయి నిరాశపరిచాడు.
అయితే రాయుడు వరుసగా విఫలమువుతున్న నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్.. అతడి ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పుడే క్రీజులోకి వచ్చిన రాయుడు రెండో బాల్ కే హిట్టింగ్ కు దిగాల్సిన అవసరమేమొచ్చిందని మండిపడ్డాడు. రాయుడు ఎలాగూ ఫీల్డింగ్ చేయడం లేదని, ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తున్న రాయుడు అది కూడా ఆడకుంటే ఎలా అని ప్రశ్నించాడు.
గవాస్కర్ మాట్లాడుతూ.. ‘నువ్వు ఫీల్డింగ్ చేయాలి. క్రీజులోకి రాగానే హిట్టింగ్ కు దిగడం మంచిది కాదు. రాయుడు మాదిరిగానే పృథ్వీ షా కూడా దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ ఇద్దరూ ఇంపాక్ట్ ప్లేయర్లుగా వస్తున్నవాళ్లే. వీళ్లు ఫీల్డింగ్ చేయరు. బ్యాట్ తో కూడా రాణించడం లేదు..’ అని అన్నాడు.
ఇదే విషయంలో గవాస్కర్ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ నిబంధన వల్ల చాలా జట్లు దీనిని ముందు బౌలింగ్ చేస్తే బౌలర్ ను ఉపయోగించుకుని తర్వాత బ్యాటర్లను క్రీజులోకి దింపుతున్నాయని ఇదెక్కడి లాజిక్ అనేది అర్థం కావడం లేదని, కనీసం ఇంపాక్ట్ ప్లేయర్లుగా బరిలోకి దిగుతున్న బ్యాటర్లు కూడా ఏమంత గొప్పగా రాణించడం లేదని ఆయన తెలిపాడు. రాయుడుతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ పృథ్వీ షా కూడా ఆరు మ్యాచ్ లు ఆడి సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగాడు.