అర్జున్ మిమ్మల్ని ఎప్పుడైనా ఔట్ చేశాడా..? సచిన్ ఎపిక్ రిప్లే
IPL 2023: సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ - 2023లో ముంబై ఇండియన్స్ కు మెంటార్ గానే గాక తన కొడుకును తీర్చిదిద్దే తండ్రిగా కూడా డబుల్ రోల్ పోషిస్తున్నాడు.

ప్రపంచ క్రికెట్ లో ఎందరో దిగ్గజ బౌలర్లకు నిద్ర లేకుండా చేసిన సచిన్ టెండూల్కర్.. తన కొడుకు అర్జున్ టెండూల్కర్ చేతిలో ఔటయ్యాడా..? అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ లో ఇది జరిగే ఆస్కారం లేదుగానీ ఏదైనా ఫ్రెండ్లీ మ్యాచ్ లో గానీ ప్రాక్టీస్ సెషన్స్ లో అయినా గానీ జరిగే ఆస్కారమెక్కువ.
తాజాగా దీనిపై సచిన్ స్పందించాడు. ముంబై - పంజాబ్ మ్యాచ్ కు ముందు సచిన్.. ట్విటర్ లో #AskSachin అంటూ అభిమానులతో ముచ్చటించాడు. ఇందులో భాగంగానే సచిన్ ను ఓ అభిమాని.. ‘మిమ్మల్ని అర్జున్ ఎప్పుడైనా ఔట్ చేశాడా..?’అని అడిగాడు.
Image credit: PTI
దానికి సచిన్ స్పందిస్తూ.. ‘అవును. ఒకసారి అవుట్ చేశాడు. లార్డ్స్ లో ఇది జరిగింది. కానీ ఈ విషయాన్ని అర్జున్ కు గుర్తు చేయొద్దు..’అని సచిన్ సమాధానమిచ్చాడు.అయితే సచిన్ ను అర్జున్ ఎప్పుడు ఔట్ చేశాడన్నది మాత్రం మాస్టర్ బ్లాస్టర్ వెల్లడించలేదు.
Image credit: PTI
అర్జున్.. 2021 నుంచే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తో ఉంటున్నా అతడికి మొదటి అవకాశం వచ్చిందే కొద్దిరోజుల క్రితం.. వాంఖెడే వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అర్జున్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ మ్యాచ్ లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇక హైదారాబాద్ తో మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ తెలివిగా బౌలింగ్ చేయడమే గాక ఓ వికెట్ కూడా తీశాడు.
ఐపీఎల్ - 2023లో అర్జున్ టెండూల్కర్ తీసింది ఒక్క వికెటే అయినా అతడి పేరు మార్మోగిపోతున్నది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు కావడంతో ఇది సహజమే అయినా మీడియా కూడా అర్జున్ కు అధిక ప్రాముఖ్యతనిస్తున్నది.
ఇక ముంబై ఇండియన్స్.. నేటి రాత్రి పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఇదివరకే ఐదు మ్యాచ్ లలో మూడు గెలిచి జోష్ మీదున్న ముంబై ఇండియన్స్.. వాంఖెడే వేదికగా పంజాబ్ ను ఢీకొననుంది. ఆరు మ్యాచ్ లు ఆడిన పంజాబ్.. మూడింట గెలిచి మూడింట్లో ఓడింది. ఈ మ్యాచ్ లో కూడా అర్జున్ రాణించాలని ముంబై ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.