- Home
- Sports
- Cricket
- అశ్విన్ ఖాతాలో మరో ఘనత.. బ్యాటర్లను డకౌట్ చేయడంలో ఏ స్పిన్నర్ అయినా అతడి తర్వాతే..!
అశ్విన్ ఖాతాలో మరో ఘనత.. బ్యాటర్లను డకౌట్ చేయడంలో ఏ స్పిన్నర్ అయినా అతడి తర్వాతే..!
IPL 2023: ఐపీఎల్ లో రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అత్యధిక మంది బ్యాటర్లను డకౌట్ చేసిన స్పిన్నర్ గా నిలిచాడు.

టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్, ప్రస్తుతం ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ కు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ తన ఖాతాలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ లో అత్యధిక మంది బ్యాటర్లను డకౌట్ చేసిన స్పిన్నర్ గా నిలిచాడు.
రాజస్తాన్ రాయల్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య గురువారం జైపూర్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో అశ్విన్.. 11వ ఓవర్లో అంబటి రాయుడును డకౌట్ చేశాడు. రహానే ను ఔట్ చేసిన తర్వాత వచ్చిన రాయుడు.. తాను ఎదుర్కున్న రెండో బంతికే భారీ షాట్ ఆడి జేసన్ హోల్డర్ కు క్యాచ్ ఇచ్చాడు.
కాగా రాయుడు వికెట్ అశ్విన్ కు ఐపీఎల్ లో 20వ డకౌట్. ఈ మ్యాచ్ కు ముందు 19 మంది బ్యాటర్లను డకౌట్ చేసిన స్పిన్నర్ గా ఉన్న అశ్విన్.. రాయుడు ను కూడా సున్నాకే ఔట్ చేయడంతో 20 మంది బ్యాటర్లను డకౌట్ చేసిన బౌలర్ గా నిలిచాడు.
ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ లసిత్ మలింగ అందరికంటే ముందున్నాడు. మలింగ.. 36 మందిని డకౌట్ చేశాడు. ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న బౌలర్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ దిగ్గజం భువనేశ్వరే. భువీ.. 25 మందిని డకౌట్ చేశాడు.
మలింగ, భువీ తర్వాత చెన్నై మాజీ బౌలర్ ప్రస్తుతం ఆ జట్టుకు బౌలింగ్ కోచ్ గా ఉన్న డ్వేన్ బ్రావో.. 24 మందిని డకౌట్ చేశాడు. రాజస్తాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, కేకేఆర్ బౌలర్ ఉమేశ్ యాదవ్ లు కూడా 22 మందిని డకౌట్ చేశారు. ఈ జాబితాలో ఇప్పుడు అశ్విన్ ఆరో స్థానానికి చేరాడు.
అయితే స్పిన్నర్ల జాబితాలో మాత్రం అశ్విన్ దే రికార్డు. కాగా ఐపీఎల్ లో మొత్తంగా అశ్విన్.. 192 మ్యాచ్ లలో 168 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అతడు.. ఆరో స్థానంలో ఉన్నాడు. బ్రావో (183), యుజ్వేంద్ర చాహల్ (178), మలింగ (170), అమిత్ మిశ్రా (170), పీయూష్ చావ్లా (168)లు అశ్విన్ కంటే ముందున్నారు.