- Home
- Sports
- Cricket
- మాటలు చెప్పడమే కాదు.. చేసి చూపెడుతున్న హిట్‌మ్యాన్.. డబ్ల్యూటీసీ కోసం ఐపీఎల్‌కు విరామం..!
మాటలు చెప్పడమే కాదు.. చేసి చూపెడుతున్న హిట్‌మ్యాన్.. డబ్ల్యూటీసీ కోసం ఐపీఎల్‌కు విరామం..!
IPL 2023: ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు ఇంగ్లాండ్ వేదికగా జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడనుంది. ఈ మెగా ఐసీసీ ఈవెంట్ కోసం భారత జట్టు ఇదివరకే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.

తన వెంట ఉన్నవారికి మాటలు చెప్పడమే కాదు.. వాటిన తన నిజ జీవితంలో ఆచరించి చూపించేవాడే నాయకుడు అవుతాడు. లేకుంటే చెప్పేదొకటి, చేసేదొకటి మాదిరిగా అయిపోతుంది ఆ నాయకుడి పరిస్థితి. తాజాగా టీమిండియా సారథి రోహిత్ శర్మ కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు.
భారత్ కు కీలక టోర్నీలు ముందున్న నేపథ్యంలో ఐపీఎల్ కు విరామమిచ్చేందుకు రోహిత్ రెడీ అయ్యాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు ఇంగ్లాండ్ వేదికగా జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడనుంది. ఈ మెగా ఐసీసీ ఈవెంట్ కోసం భారత జట్టు ఇదివరకే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. 2021లో కాస్తలో డబ్ల్యూటీసీ ట్రోఫీని మిస్ అయ్యిన భారత్ ఈసారి మాత్రం దానిని చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది.
కాగా ఐపీఎల్ లో రెండు నెలల పాటు ఆడబోయే భారత క్రికెటర్లు.. డబ్ల్యూటీసీ వరకు ఫిట్నెస్ కాపాడుకుంటారా..? గాయాల పాలవకుంటా ఉంటారా..? అన్నది ఇప్పుడు భారత అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. తీరిక లేని షెడ్యూల్స్ తో గడిపే ఐపీఎల్ వంటి మెగా టోర్నీ నుంచి విరామం తీసుకుంటే తప్ప డబ్ల్యూటీసీలో రాణించలేమన్నది భారత జట్టుకూ తెలుసు.
ఇందులో భాగంగానే కొద్దిరోజుల క్రితం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్.. ఐపీఎల్ లో ఆడబోయే ఆటగాళ్లు, ఫ్రాంచైజీల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. రోహిత్ మాట్లాడుతూ.. ‘సిరీస్ ముగిసిన తర్వాత ఇక ప్లేయర్లు వాళ్ల ఫ్రాంచైజీలకు ఆడనున్నారు. ఇప్పుడు అంతా ఫ్రాంచైజీల ఇష్టం. కీలక ఆటగాళ్ల వర్క్ లోడ్ విషయంలో మేం ఇదివరకే ఫ్రాంచైజీలకు పలు కీలక సూచనలు చేశాం. క్రికెటర్లు కూడా ఏం చిన్న పిల్లలు కాదు. వాళ్లు కూడా ఫిట్నెస్ చూసుకోవాలి. గాయాలు కాకుండా కాపాడుకోవాలి’అని చెప్పాడు.
పరిస్థితులకు తగ్గట్టుగా కొన్ని మ్యాచ్ లకు విశ్రాంతి తీసుకుంటే మంచిదని రోహిత్ క్రికెటర్లతో పాటు ఫ్రాంచైజీలకూ సూచించాడు. అయితే సూచనతోనే వదిలేయకుండా తాను కూడా వాటిని ఆచరిస్తున్నాడు. ఈ సీజన్ లో రోహిత్.. ముంబై ఇండియన్స్ ఆడబోయే పలు మ్యాచ్ లకు దూరంగా ఉండనున్నాడు. రోహిత్ టీమ్ తో పాటే ఉన్నా అన్ని మ్యాచ్ లకూ ఆడడని తెలుస్తున్నది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో వచ్చిన నివేదిక ప్రకారం.. ఈ సీజన్ లో రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్ లకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. అతడు రెస్ట్ తీసుకునే మ్యాచ్ లకు సూర్యకుమార్ యాదవ్ ముంబై సారథిగా వ్యవహరించనున్నట్టు తెలుస్తున్నది.
ఇదే నిజమైతే రోహిత్ నిర్ణయం అభినందించదగ్గదే. పదేండ్లుగా ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న భారత అభిమానుల ఆశలకు అనుగుణంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని మిగిలిన ఫ్రాంచైజీలో ఉన్న క్రికెటర్లు కూడా ఫాలో అయితే బాగుంటుందని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.