ఓపెనర్‌గా అశ్విన్.. షాకిచ్చిన రాజస్తాన్.. కానీ ఇదే తొలిసారి కాదు..
IPL 2023: బుధవారం గువహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓపెనర్ గా బరిలోకి దిగాడు.

Image credit: PTI
రాజస్తాన్ రాయల్స్ బుధవారం తన అభిమానులతో పాటు ఐపీఎల్ ఫ్యాన్స్ కూ షాకిచ్చింది. బుధవారం గువహతి వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రెగ్యులర్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ - జోస్ బట్లర్ కు బదులుగా జైస్వాల్ - అశ్విన్ లను పంపించింది.
ఈ మ్యాచ్ లో తొలుత ఫీల్డింగ్ చేసిన రాజస్తాన్.. పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఊచకోతతో అల్లాడిన విషయం తెలిసిందే. అయితే అతడు హోల్డర్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడగా లాంగాన్ బౌండరీ వద్ద ఉన్న బట్లర్ పరుగెత్తుకుని వచ్చి ముందుకు డ్రైవ్ చేస్తూ క్యాచ్ పట్టడంతో అతడి మోచేతికి గాయమైంది. దీంతో అతడు ఓపెనర్ గా రాలేదు.
అయితే బట్లర్ స్థానంలో జైస్వాల్ తో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగిన అశ్విన్ కు ఇలా రావడం ఫ్యాన్స్ కు కాస్త షాకింగే అయినప్పటికీ ఓపెనింగ్ చేయడం అతడికి కొత్తేం కాదు. గతంలో కూడా అశ్విన్.. ఐపీఎల్ లో ఓపెనర్ గా వచ్చినవాడే.
సరిగ్గా పదేండ్ల క్రితం.. 2013లో అశ్విన్ ఓపెనర్ గా బరిలోకి దిగాడు. అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన అశ్విన్.. కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడిన మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చాడు. ఈ మ్యాచ్ లో 13 బాల్స్ ఆడి 11 పరుగులు చేశాడు. మళ్లీ పదేండ్ల తర్వాత ఇప్పుడు ఓపెనింగ్ కు దిగడం గమనార్హం.
ఇక నిన్నటి మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన అశ్విన్ ఆకట్టుకోలేదు. నాలుగు బంతులాడిన ఆష్ అన్న.. ఒక్క పరుగు కూడా చేయకుండానే ఔటై అభిమానులను నిరాశపరిచాడు. ఆఫ్ స్పిన్ తో పాటు బ్యాటింగ్ చేయగల సమర్థుడు అశ్విన్. అతడి బ్యాటింగ్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.
అశ్విన్ పేరిట టెస్టులలో ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి. 92 టెస్టులలో అశ్విన్.. 3,129 పరుగులు కూడా సాధించాడు. ఇందులో ఐదు శతకాలు, 13 అర్థ శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 124. వన్డేలలో కూడా 113 మ్యాచ్ లలో 707 రన్స్ చేసిన అశ్విన్.. ఒక హాఫ్ సెంచరీ కూడా చేశాడు.