- Home
- Sports
- Cricket
- IPL 2023: క్రికెట్ హిస్టరీలో రెండోసారి.. ఐపీఎల్‌లో ఫస్ట్ టైమ్.. చరిత్ర సృష్టించిన పాండ్యా బ్రదర్స్
IPL 2023: క్రికెట్ హిస్టరీలో రెండోసారి.. ఐపీఎల్‌లో ఫస్ట్ టైమ్.. చరిత్ర సృష్టించిన పాండ్యా బ్రదర్స్
IPL 2023, GT vs LSG: ఐపీఎల్-16లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. బ్రదర్స్ హార్ధిక్ పాండ్యా - కృనాల్ పాండ్యాలు రెండు వేర్వేరు జట్లకు సారథ్యం వహిస్తున్నారు.

ఐపీఎల్‌లో అరుదైన దృశ్యం. ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు సోదరులు.. ప్రత్యర్థులుగా మారారు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, లక్నో సూపర్ జెయింట్స్ సారథి కృనాల్ పాండ్యాలు అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ‘ఢీ’కొనబోతున్నారు. తద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
ఫ్రాంచైజీ క్రికెట్ వచ్చిన తర్వాత అన్నాదమ్ములిద్దరూ రెండు వేర్వేరు జట్లలో ఆడటం సర్వసాధారణమే అయిపోయింది. కానీ ఆ ఇద్దరూ.. రెండు వేర్వేరు జట్లకు సారథులుగా ఉండటమే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో తొలిసారి.
గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ - లక్నో కెప్టెన్ కృనాల్ లు నేడు అహ్మదాబాద్ వేదికగా ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతుండటం ఐపీఎల్ లో ఇదే తొలిసారి కాగా భారత క్రికెట్ చరిత్రలో కూడా దేశవాళీ, ఇతర టోర్నీలలోనూ ఇదే ప్రథమం.
ప్రపంచ క్రికెట్ లో ఇలాంటి దృశ్యం ఒకసారి ఆవిష్కృతమైంది. ఆస్ట్రేలియాకు చెందిన బ్రదర్స్ మైక్ హస్సీ, డేవిడ్ హస్సీలు బిగ్ బాష్ లీగ్ లో భాగంగా 2016లో ఫైనల్ లో తలపడ్డారు. వారి ముందు కూడా ఇలా జరిగిన సందర్భాలు లేవు.
తాజాగా ఈ ఘనతను పాండ్యా బ్రదర్స్ కూడా అందుకున్నారు. కాగా టాస్ సందర్భంగా మురళీ కార్తీక్ ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ ఈ ఇద్దరినీ వారి ఫీలింగ్ గురించి చెప్పమని అడిగాడు. టాస్ గెలిచిన కృనాల్ మాట్లాడుతూ.. ‘ఇది నిజంగా మా ఇద్దరికీ కల నిజమైన ఫీలింగ్. కానీ మేం ఫీల్డ్ లోకి దిగాక మాత్రం బ్రదర్స్ కంటే ఆటమీదే మా దృష్టి’ అని చెప్పాడు.
ఇక ఇదే విషయమై హార్ధిక్ స్పందిస్తూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ‘ఇది మా ఇద్దరికీ చాలా ఎమోషనల్ డే. మా నాన్న ఇది చూసి చాలా గర్వపడతారు. ఐపీఎల్ లో ఇలా జరుగడం ఇదే ప్రథమం. మా ఫ్యామిలీ కూడా ఇది చూసి చాలా గర్వపడుతుంది. ఇవాళ ఒక పాండ్యా అయితే కచ్చితంగా గెలుస్తాడు. ఇది మా గురించి మేం ఎక్స్‌ప్రెస్ చేసుకోవడం వంటిది. ఫలితం గురించి మేం ఆలోచించడం లేదు..’అని చెప్పుకొచ్చాడు.