- Home
- Sports
- Cricket
- నా దేశం కూడా నన్ను ఇంత బాగా చూసుకోలేదు.. కేకేఆర్‌ను విడిచివెళ్లే ప్రసక్తేలేదు : రసెల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నా దేశం కూడా నన్ను ఇంత బాగా చూసుకోలేదు.. కేకేఆర్‌ను విడిచివెళ్లే ప్రసక్తేలేదు : రసెల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
IPL 2023: ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ తాజాగా తన దేశ క్రికెట్ బోర్డుపై విమర్శలు గుప్పించాడు.

ఐపీఎల్ లో ఫ్రాంచైజీకి ఒక ఆరాధ్య క్రికెటర్ ఉంటాడు. చెన్నైకి ధోని, ఆర్సీబీకి కోహ్లీ, ముంబైకి రోహిత్.. ఇలా ఆయా జట్లకు పలువురు ఆటగాళ్లు బ్రాండ్ అంబాసిడర్లు. ఈ కోవలోకే వచ్చేవాడు వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్. 2014 నుంచి కేకేఆర్ కు ఆడుతున్న రసెల్.. రెండో జట్టువైపునకు కన్నెత్తి కూడా చూడలేదు.
వరుసగా పదో సీజన్ లో కూడా కేకేఆర్ కు ఆడుతున్న రసెల్.. ఆ జట్టుకు ఆల్ రౌండర్ గా సేవలందిస్తున్నాడు. తాజాగా అతడు కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ పై ప్రశంసలు కురిపించాడు. కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం తనను సొంత మనిషిలా చూసుకుందని, మోకాలికి గాయమైనప్పుడు తనపై కుటుంబసభ్యుడికంటే ఎక్కువగా కేర్ తీసుకుందని వివరించాడు. తన సొంత దేశం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా అలా చూసుకోలేదని అన్నాడు. శనివార రసెల్ బర్త్ డే సందర్భంగా అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
స్టార్ స్పోర్ట్స్ లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో రసెల్ మాట్లాడుతూ.. ‘నాకు కొన్నేండ్ల క్రితం మోకాలికి గాయమైంది. అప్పుడు కేకేఆర్ మేనేజ్మెంట్ నామీద ప్రత్యేక శ్రద్ధ వహించింది. నా ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చును భరించింది. అది నాకు చాలా స్పెషల్ గా అనిపించింది.
నాకు తెలిసి ఏ ఇతర ఫ్రాంచైజీ గానీ నా సొంత దేశ క్రికెట్ బోర్డు కూడా నా మీద అంత ఖర్చు చేయదు. అంత బాగా చూసుకోదు. నాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. అసలు ఇన్నేళ్ల నా ఐపీఎల్ కెరీర్ లో నేను ఫ్రాంచైజీ మారాలన్న ఆలోచన కూడా రాలేదు.
నేను కేకేఆర్ తో 9 సీజన్లు ఆడాను. ఇది పదో సీజన్. ఇక్కడ నా మనసుకు నచ్చినవాళ్లు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా కేకేఆర్ టీమ్ కు కర్త కర్మ క్రియ అయిన వెంకీ మైసూర్. నేను ఆయనను చాలా గౌరవిస్తాను. ఐపీఎల్ సీజన్ లేకున్నా నేను మాములు టైమ్ లో కూడా వారిని కలుస్తుంటా. ఈ టీమ్ లో ఉండే ఆటగాళ్లతో కూడా నాకు మంచి సంబంధాలున్నాయి..’అని చెప్పాడు.
కాగా 2014 నుంచి కేకేఆర్ కు ఆడుతున్న రసెల్.. ఇప్పటివరకు 106 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 90 ఇన్నింగ్స్ లలో 2,143 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో మాత్రం 8 మ్యాచ్ లలో 108 పరుగులే చేసి నిరాశపరుస్తున్నాడు. కేకేఆర్ - గుజరాత్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో రసెల్.. 19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేశాడు.