మరో మైలురాయి చేరుకోనున్న ఐపీఎల్.. నేడే 1000వ మ్యాచ్..
1000th Match in IPL: భారత క్రికెట్ దశ, దిశను మార్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ నేడు మరో మైలురాయిని చేరుకోబోతున్నది.

2008 లో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నేడు మరో మహాఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఐపీఎల్ -16లో భాగంగా ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య వాంఖెడే వేదికగా జరుగబోయే మ్యాచ్ ఈ లీగ్ 1000వది కావడం గమనార్హం.
Image credit: Sandeep Rana
భారత క్రికెట్ దశ, దిశను మార్చిన ఐపీఎల్.. పదహారేండ్లుగా భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. ప్రతీ ఏడాది కొత్త హంగులు, నిబంధనలతో పాటు వినోదాన్ని పంచుతున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ లో వెయ్యో మ్యాచ్ ప్రత్యేకం కానున్నది.
ఈ సందర్భంగా బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. వాంఖెడే వేదికగా ముంబై - రాజస్తాన్ మధ్య మొదలుకాబోయే ఈ మ్యాచ్ కు ముందు బీసీసీఐ.. ఓ చిన్నపాటి సెలబ్రేషన్స్ ఏర్పాటుచేసింది. మ్యాచ్ కు ముందు రవిశాస్త్రి అభిమానులనుద్దేశించి ప్రసంగిస్తాడు. 10 - 15 నిమిషాల పాటు ఈ కార్యక్రమం ఉండనుంది.
వాస్తవానికి ఈ సీజన్ ఆరంభం ముందే వెయ్యో మ్యాచ్ పై చర్చలు జరిగాయి. చెన్నై - ముంబై మధ్య మే 6న చెపాక్ లో జరుగబోయే మ్యాచ్.. ఈ లీగ్ లో వెయ్యో మ్యాచ్ అవుతుందని వార్తలు వచ్చాయి. ఆ మేరకు చెపాక్ లో ఏర్పాట్లు చేయనున్నారని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపించాయి.
కానీ ఐపీఎల్ లో గతంలో రద్దు చేయబడిన ఏడు మ్యాచ్ లను కూడా కౌంట్ లోకి తీసుకోకుంటే ఇది ముంబై - చెన్నై మధ్య మే 6న జరిగే పోరుగానే ఉండేది. కానీ అవి రద్దు అయినా వాటిని మ్యాచ్ లు గానే పరిగణనలోకి తీసుకుంటున్నారు. దాంతో నేడు ముంబై - రాజస్తాన్ మ్యాచే 1000వది కానున్నది. ఈ సీజన్ కు ముందు ఐపీఎల్ లో మొత్తం 958 మ్యాచ్ లు జరిగాయి. నేడు ముంబై - రాజస్తాన్ మ్యాచ్ ఐపీఎల్ -16లో 42వది. దీంతో వెయ్యి మ్యాచ్ లు పూర్తవుతున్నాయి.
కాగా ఈ మ్యాచ్ లో ఐపీఎల్ తో పాటు రోహిత్ శర్మకు కూడా చాలా స్పెషల్. నేడు రోహిత్ పుట్టినరోజు. అంతేగాక కెప్టెన్ గా అతడికి 150వ మ్యాచ్. 2013లో ఏప్రిల్ 24న ముంబై ఇండియన్స్ తరఫున ఫస్ట్ మ్యాచ్ ఆడిన రోహిత్.. కెప్టెన్ గా పదేండ్లు పూర్తి చేసుకున్నాడు.