- Home
- Sports
- Cricket
- ఆర్సీబీకి అంత సీన్ లేదు.. ఈసారి ఐపీఎల్ గెలిచేది ఆ టీమే.. సౌతాఫ్రికా మాజీ ఆల్ రౌండర్
ఆర్సీబీకి అంత సీన్ లేదు.. ఈసారి ఐపీఎల్ గెలిచేది ఆ టీమే.. సౌతాఫ్రికా మాజీ ఆల్ రౌండర్
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇంతవరకూ కప్పు కొట్టని టీమ్ లలో ఆర్సీబీ ఒకటి. అయితే ఈసారి ఆ జట్టుకు నిరాశ తప్పదంటున్నాడు జాక్వస్ కలిస్.

ఐపీఎల్ మొదలై 15 సీజన్లు గడిచి 16వ సీజన్ లోకి అడుగిడుతున్నా ఇంతవరకూ కప్ కొట్టని టీమ్ లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. ఈ జాబితాలో లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నా ఆ టీమ్ ఎంట్రీ ఇచ్చిందే గత సీజన్ లో కావడం గమనార్హం.
Image credit: PTI
గత మూడు సీజన్లలోనూ ఆర్సీబీ ప్లేఆఫ్స్ వరకు వెళ్లగలిగింది. కానీ ఫైనల్ కు అర్హత సాధించలేక చతికిలపడింది. టోర్నీలో తొలిసారి బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ గత సీజన్ లో ఏకంగా టోర్నీ విజేతగా నిలిచింది. ఈ ఏడాది కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు హార్ధిక్ పాండ్యా సేన సిద్ధమవుతోంది.
కాగా శుక్రవారం ప్రారంభం కాబోయే ఐపీఎల్ సీజన్ లో విజేత ఎవరవుతారనేదానిపై ఇప్పటికే క్రికెట్ విశ్లేషకులు వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్, మైఖేల్ వాన్ లు రాజస్తాన్ రాయల్స్ కు ఓటేయగా.. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్వస్ కలిస్ మాత్రం ఈసారి టోర్నీలో మొదటిసారి కప్పు గెలవబోయే జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ అని స్పష్టం చేశాడు.
ఈ సీజన్ లో స్టార్ స్పోర్ట్స్ కామెంట్రీ టీమ్ లో ఒకడిగా ఉన్న కలిస్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ విజేతను అంచనా వేయడం చాలా కష్టం. ప్లేఆఫ్స్, ఫైనల్స్ లో ఎవరెరవరు ఉంటారు..? అన్నది చాలా టఫ్ టాస్క్. నాకు నా గట్ ఫీలింగ్ ప్రకారం ఈ ఏడాది ఫైనల్ కు ముంబై ఇండియన్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడతాయి. ఫైనల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కప్ కొడుతుందని నేను భావిస్తున్నా..’అని తెలిపాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ తన మొదటి మ్యాచ్ ను ఏప్రిల్ 1న లక్నో వేదికగా జరుగబోయే మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ తర్వాత ఏప్రిల్ నాలుగున గుజరాత్ టైటాన్స్ తో రెండో మ్యాచ్ ఆడనుంది. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.
ఈసారి పంత్ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటే అయినా డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, ఫిల్ సాల్ట్, సర్ఫరాజ్ ఖాన్, ఆన్రిచ్ నోర్త్జ్, అక్షర్ పటేల్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ వంటి ఆటగాళ్లతో ఢిల్లీ జట్టు బలంగానే ఉంది. డేవిడ్ వార్నర్ సారథ్యంలో ఈ సీజన్ లో అయినా ఢిల్లీ తమ కప్పు కలను నెరవేర్చుకుంటుందో చూడాలి.