ఒక్క మ్యాచ్ ఆడకుండా ఐపీఎల్ టైటిల్ కొట్టేశారు.. లిస్టులో సంజూ శాంసన్‌తో పాటు...
ఒకప్పుడు వరల్డ్ కప్ గెలవడం ఎలాగో ఇప్పుడు ఐపీఎల్ టైటిల్ గెలవడం కూడా అంతే! ఐపీఎల్ గెలిచిన టీమ్‌లో సభ్యులుగా ఉండడాన్ని చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నారు క్రికెటర్లు. ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్, ‘మిస్టర్ 360 డిగ్రీస్’ ఏబీ డివిల్లియర్స్ వంటి దిగ్గజాలు కొందరు.. ఈ ఫీట్ సాధించకుండానే రిటైర్ అయిపోయారు..

Rohit Sharma
రోహిత్ శర్మ, డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ టీమ్ ప్లేయర్‌గా ఓ సారి, ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచాడు. కర్ణ్ శర్మ వంటి ప్లేయర్లు అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఐపీఎల్ టైటిల్స్ గెలిచారు. అయితే కొందరు స్టార్ ప్లేయర్లు మాత్రం ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడకుండా ఐపీఎల్ గెలిచిన టీమ్స్‌లో సభ్యులుగా ఉన్నారు..
అభినవ్ ముకుంద్: ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో ఉన్న ప్లేయర్లలో అభినవ్ ముకుంద్ ఒకడు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 141 మ్యాచులు, లిస్టు ఏలో 84 మ్యాచులు ఆడిన అభినవ్ ముకుంద్, 2008 నుంచి 2012 వరకూ సీఎస్‌కేలో సభ్యుడిగా ఉన్నాడు. తన కెరీర్‌లో మూడంటే మూడు ఐపీఎల్ మ్యాచులే ఆడిన అభినవ్ ముకుంద్, 2011లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌లో సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు..
sanju samson
సంజూ శాంసన్: ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కి కెప్టెన్‌గా ఉన్న సంజూ శాంసన్, 2012లో ఐపీఎల్ కెరీర్ ఆరంభించాడు. సంజూ శాంసన్‌ని కొనుగోలు చేసిన కేకేఆర్, ఆ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. 2012లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన కేకేఆర్‌లో సభ్యుడిగా ఉన్నా, సంజూ ఐపీఎల్ ఆరంగ్రేటం చేసింది మాత్రం 2013లోనే...
అక్షర్ పటేల్: ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు అక్షర్ పటేల్. 2013లో ముంబై ఇండియన్స్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు అక్షర్ పటేల్. అదే సీజన్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్ గెలిచింది ముంబై ఇండియన్స్. ఆ తర్వాతి సీజన్‌లో ఐపీఎల్‌లో ఆరంగ్రేటం చేశాడు అక్షర్ పటేల్...
విజయ్ శంకర్: ఐపీఎల్‌లో రాణించి, టీమిండియా తరుపున వన్డే వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్లలో విజయ్ శంకర్ ఒకడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ టీమ్‌లో ఉన్న విజయ్ శంకర్, 2014లో ఐపీఎల్ కెరీర్‌ని ప్రారంభించాడు. అయితే 2015, 2016 సీజన్లలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు విజయ్ శంకర్. 2016లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో సభ్యుడిగా విజయ్ శంకర్, 2022లో గుజరాత్ టైటాన్స్ తరుపున 4 మ్యాచులు ఆడి రెండోసారి టైటిల్ గెలిచాడు..
ఆదిత్య తారే: ఐపీఎల్‌లో అత్యంత పటిష్టమైన రిజర్వు బెంచ్ ఉన్న టీమ్‌గా ఉండేది ముంబై ఇండియన్స్. 2019లో నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచింది ముంబై ఇండియన్స్. ముంబైకి కొన్ని మ్యాచుల్లో విజయాలు అందించిన ఆదిత్య తారే, 2019 సీజన్‌లో ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు... అంతకుముందు 2015లో టైటిల్ గెలిచినప్పుడు రెండు మ్యాచులు ఆడిన ఆదిత్య తారే, 2020లో కూడా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా ఐపీఎల్ గెలిచాడు..
ఛతేశ్వర్ పూజారా: విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, డేల్ స్టెయిన్, క్రిస్ గేల్, రిషబ్ పంత్ వంటి హిట్టర్లు కూడా సాధించలేకపోయిన ఐపీఎల్ టైటిల్‌ని ఛతేశ్వర్ పూజారా సొంతం చేసుకున్నాడు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ముందు పూజారాని కౌంటీ మ్యాచులు ఆడనివ్వకూడదని భావించిన సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్, పూజారాని వేలంలో రూ.50 లక్షలకు కొనుగోలు చేశాడు. దీంతో ఐపీఎల్ 2021 సీజన్‌లో టైటిల్ గెలిచిన టీమ్‌లో సభ్యుడిగా ఉన్న ఛతేశ్వర్ పూజారా.. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు..