- Home
- Sports
- Cricket
- ఇంపాక్ట్ ప్లేయర్ వాళ్లకా? మనకా! గత సీజన్‌లో మూడు సార్లు డకౌట్ అయిన అనుజ్ రావత్‌ని...
ఇంపాక్ట్ ప్లేయర్ వాళ్లకా? మనకా! గత సీజన్‌లో మూడు సార్లు డకౌట్ అయిన అనుజ్ రావత్‌ని...
ఐపీఎల్‌లో ఆర్‌సీబీ రూటే సెపరేట్. బెంగళూరు, టైటిల్ బెంగ తీర్చాలని ఐపీఎల్ రూల్స్‌లో ఎన్ని మార్పులు చేసినా, అవి కూడా ఆర్‌సీబీలోకి వచ్చేసరికి ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఈ సీజన్‌లో కొత్తగా తీసుకొచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా ఆర్‌సీబీకి ఏ మాత్రం కలిసి రాలేదు...

జనాల్లో బీభత్సమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ప్లేయర్లను ఏ ప్రాతిపదికగా సెలక్ట్ చేసుకుంటుందనేది ఎవ్వరికీ అంతుపట్టని విషయం... మిగిలిన ఫ్రాంఛైజీలు ప్లేయర్ల గణాంకాలు, స్ట్రైయిక్ రేటు, యావరేజ్ అన్నీ చూసి ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటే, ఆర్‌సీబీ మాత్రం పేరు బాగుంటే ప్లేట్ ఎత్తేస్తుందని విమర్శలు ఉన్నాయి..
మిగిలిన టీమ్స్, అండర్19 వరల్డ్ కప్ హీరోలను, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో బాగా ఆడిన ప్లేయర్లను పట్టుకుంటే వీళ్లు మాత్రం ఎవ్వరూ పట్టించుకోని ప్లేయర్లను ఏరి కోరి తీసుకుంటారు. అందుకే తరాలు మారుతున్నా, ఆర్‌సీబీ తలరాత మాత్రం మారడం లేదు..
ఆర్‌సీబీ ఓ ప్లేయర్ కోసం ప్రయత్నిస్తుందని తెలిస్తే, మిగిలిన టీమ్స్ కావాలని అతని రేటును పెంచుతూ పోతాయి. బెంగళూరు కావాలనుకున్న ప్లేయర్ కోసం ఓ ప్లాన్ లేకుండా ఎంతైనా పెట్టేందుకు రెఢీ అవుతుందని మిగిలిన ఫ్రాంఛైజీలకు బాగా ఎరుక.. హసరంగ, మ్యాక్స్‌వెల్, హర్షల్ పటేల్ వంటి ప్లేయర్లు ఇలా కోట్ల రూపాయలు దక్కించుకున్నారు..
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అవుటైన మహిపాల్ లోమ్రోర్ ప్లేస్‌లో అనుజ్ రావత్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకొచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇన్నింగ్స్ డెత్ ఓవర్లలో బ్యాటింగ్‌కి వచ్చాడంటే అనుజ్ రావత్, ఢిల్లీ బౌలర్లను చీల్చి చెండాడేస్తాడేమో అనుకున్నారు స్టేడియంలో ఆశగా మ్యాచ్ చూస్తున్న బెంగళూరు ఫ్యాన్స్...
అయితే 7 బంతుల తర్వాత సింగిల్ తీసి ఖాతా తెరిచిన అనుజ్ రావత్, 22 బంతులు ఆడి 15 పరుగులే చేసి టెస్టు బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ని విసిగించాడు. బౌండరీలతో డీల్ చేయాల్సిన డెత్ ఓవర్లలో అనుజ్ రావత్ స్ట్రైయిక్ రేటు 69 కూడా దాటలేదు...
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అనుజ్ రావత్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకొచ్చింది ఆర్‌సీబీ. ఆ మ్యాచ్‌లో 5 బంతులు ఆడి 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు అనుజ్. అయినా అతనిపై నమ్మకం ఉంచి, మరోసారి ఇంపాక్ట్ చేస్తాడని టీమ్‌లోకి తెచ్చిన ఆర్‌సీబీకి అతను ప్రత్యర్థికి ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా మారడం చూసి షాక్ తగిలింది..
ఐపీఎల్ 2022 సీజన్‌లో మూడు సార్లు డకౌట్ అయిన అనుజ్ రావత్, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. గత సీజన్‌లో అనుజ్ రావత్ 8 మ్యాచులు ఆడితే చేసింది 129 పరుగులు. అందులో ముంబైపై చేసిన 66 పరుగులు తీసేస్తే, మిగిలిన 7 మ్యాచుల్లో చేసింది 63 పరుగులే.. స్ట్రైయిక్ రేటు 109 మాత్రమే..
వేరే ఫ్రాంఛైజీ అయితే ఇలాంటి పర్ఫామెన్స్ ఇచ్చిన ప్లేయర్‌ని వేలానికి వదిలేస్తుంది. అయితే 2022 మెగా వేలంలో రూ.3 కోట్ల 40 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసిన అనుజ్ రావత్‌ని అలాగే అట్టి పెట్టుకున్న ఆర్‌సీబీ, అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్న రిజల్ట్ మాత్రం దక్కడం లేదు..