- Home
- Sports
- Cricket
- శుబ్‌మన్ గిల్‌కి అంత సీన్ లేదు... ఆరెంజ్ క్యాప్ రేసు ఆ ఇద్దరి మధ్యే! రుతురాజ్ గైక్వాడ్‌కి పోటీ అతనే...
శుబ్‌మన్ గిల్‌కి అంత సీన్ లేదు... ఆరెంజ్ క్యాప్ రేసు ఆ ఇద్దరి మధ్యే! రుతురాజ్ గైక్వాడ్‌కి పోటీ అతనే...
ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభమై వారం కూడా కాకముందే ఆరెంజ్ క్యాప్ రేసు మొదలైపోయింది. ఇప్పటికే ఈసారి ఆరెంజ్ క్యాప్ గెలవబోయేది ఇతనేనంటూ, అంచనాలు వేస్తూ బెట్టింగ్‌లు కూడా కాసేస్తున్నారు చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్... స్టార్ స్పోర్ట్స్ ఎలైట్ ఎక్స్‌పర్ట్స్ ప్యానెల్ కూడా ఈసారి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉండే ప్లేయర్‌ను ఎంచుకుంది...

Image credit: PTI
ఐపీఎల్ 2023 సీజన్‌కి ముందు టీ20ల్లో సెంచరీ, వన్డేల్లో డబుల్ సెంచరీ బాది సూపర్ ఫామ్‌లో ఉన్నాడు శుబ్‌మన్ గిల్. ఈసారి గిల్‌కి ఆరెంజ్ క్యాప్ దక్కకుండా అడ్డుకోవడం చాలా కష్టమేనని అనుకున్నారంతా. అందుకు తగ్గట్టుగానే తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు శుబ్‌మన్ గిల్...
అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 13 బంతుల్లో 3 ఫోర్లతో 14 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, ఆన్రీచ్ నోకియా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. యాదృచ్ఛికంగా స్టార్ స్పోర్ట్స్ ఎలైట్ ప్యానెల్ అంచనా వేసిన లిస్టులో కూడా శుబ్‌మన్ గిల్, టాప్‌లో లేకపోవడం విశేషం..
Image credit: PTI
ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగులు చేసి, అజేయ ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీకి విజయాన్ని అందించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ 2023 సీజన్ ఆరెంజ్ క్యాప్‌లో రేసులో ఉంటాడని అంచనా వేసింది నిపుణుల ప్యానెల్...
అలాగే మొదటి రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు బాదిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీతో ఆరెంజ్ క్యాప్ కోసం పోటీపడతాడని అంచనా వేసింది నిపుణుల ప్యానెల్. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు బాదిన రుతురాజ్ గైక్వాడ్, 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచి, అతి పిన్న వయసులో ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు..
విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ తర్వాత ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌కి చోటు ఇచ్చిన నిపుణులు, శుబ్‌మన్ గిల్‌తో పాటు డేవిడ్ వార్నర్ కూడా ఈ రేసులో ఉంటారని అంచనా వేశారు...
Image credit: PTI
గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున 863 పరుగులు చేసిన జోస్ బట్లర్, డేవిడ్ వార్నర్ 2016 సీజన్‌లో చేసిన 848 పరుగుల రికార్డును అధిగమించేశాడు. అయితే అదే సీజన్‌లో విరాట్ కోహ్లీ చేసిన 973 పరుగుల రికార్డుకి 110 పరుగుల దూరంలో ఆగిపోయాడు జోస్ బట్లర్..
అలాగే డేవిడ్ వార్నర్, ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఏకైక ప్లేయర్‌గా ఉన్నాడు. 2015లో 562 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన వార్నర్, 2017లో 641 పరుగులు, 2019లో 692 పరుగులు చేసి సన్‌రైజర్స్ హైదరాబద్ తరుపున మూడు ఆరెంజ్ క్యాప్‌లు గెలిచాడు..
Image credit: PTI
నిపుణులు అంచనా వేసిన లిస్టులో ఉన్న ఫాఫ్ డుప్లిసిస్, 2021 సీజన్‌లో 2 పరుగుల తేడాతో ఆరెంజ్ క్యాప్ కోల్పోయాడు. సీఎస్‌కే తరుపున ఆడిన ఫాఫ్ డుప్లిసిస్ 633 పరుగులు చేయగా తన టీమ్‌మేట్ రుతురాజ్ గైక్వాడ్ 635 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచాడు.
ఆశ్చర్యకరంగా ఐపీఎల్ 2020 సీజన్‌లో 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచి, ఆ తర్వాత రెండు సీజన్లలోనూ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టాప్ 3లో నిలిచిన కెఎల్ రాహుల్‌ని.. ఈ నిపుణులు అస్సలు పట్టించుకోకపోవడం విశేషం..