- Home
- Sports
- Cricket
- గుజరాత్ టైటాన్స్‌లోకి మరో స్టార్ ఆల్‌రౌండర్... కేన్ విలియంసన్ ప్లేస్‌లో దసున్ శనకకి అవకాశం..
గుజరాత్ టైటాన్స్‌లోకి మరో స్టార్ ఆల్‌రౌండర్... కేన్ విలియంసన్ ప్లేస్‌లో దసున్ శనకకి అవకాశం..
ఐపీఎల్ 2023 సీజన్‌లో టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో గుజరాత్ టైటాన్స్ ఒకటి. గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా సీజన్‌ని స్టార్ట్ చేసి, టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్, ఈసారి అత్యంత పటిష్టమైన టీమ్స్‌లో ఒకటిగా ఉంది. కేన్ విలియంసన్ దూరమైన టైటాన్స్ మరింత పటిష్టంగా మారనుంది.

Kane Williamson Injury
మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే...కేన్ విలియంసన్ మోకాలికి తీవ్ర గాయం కావడంతో అతను ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
కేన్ విలియంసన్ స్థానంలో శ్రీలంక కెప్టెన్ దసున్ శనకని తీసుకుంది గుజరాత్ టైటాన్స్. శ్రీలంక టీ20 కెప్టెన్‌గా ఉన్న దసున్ శనక, ఇప్పటిదాకా 181 టీ20 మ్యాచులు ఆడాడు. అయితే ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు...
టీ20ల్లో 141.94 స్ట్రైయిక్ రేటుతో 3702 పరుగులు చేసిన దసున్ శనక, బౌలింగ్‌లోనూ 59 వికెట్లు తీశాడు. జనవరిలో ఇండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో 187.87 స్ట్రైయిక్ రేటుతో 124 పరుగులు చేశాడు దసున్ శనక. అయితే అప్పటికే ఐపీఎల్ 2023 మినీ వేలం జరగడం, అందులో దసున్ శనకని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడం జరిగిపోయాయి..
ఐపీఎల్ 2023 సీజన్‌లో బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకే గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడబోతున్నాడు దసున్ శనక. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌కి అందుబాటులో లేని దసున్ శనక, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఏప్రిల్ 9న ఇండియాకి రాబోతున్నాడు.
Image credit: PTI
దసున్ శనక ఎంట్రీతో గుజరాత్ టైటాన్స్‌లో ఆల్‌రౌండర్ల సంఖ్య పెరగనుంది. ఇప్పటికే రషీద్ ఖాన్, హార్ధిక్ పాండ్యా, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా రూపంలో ఐదుగురు ఆల్‌రౌండర్లు గుజరాత్ టైటాన్స్‌లో ఉన్నారు...
‘ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఇండియా- శ్రీలంక టీ20 సిరీస్ జరిగి ఉంటే, శనకని కొనుగోలు చేయడానికి మా దగ్గర డబ్బులు ఉండేవి కావు! శనకని కొనుగోలు చేయడానికి ఫ్రాంఛైజీలు పోటీపడేవి. శనక బ్యాటింగ్, బౌలింగ్ టాప్ క్లాస్... ఎంత లేదన్నా దసున్ శనక రూ.8-10 కోట్లు దక్కించుకునేవాడు. మాతో పాటు కొన్ని ఫ్రాంఛైజీల దగ్గర అంత డబ్బు లేదు.. ’ అంటూ జనవరిలో జరిగిన సిరీస్ సమయంలో వ్యాఖ్యానించాడు లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్..