- Home
- Sports
- Cricket
- ‘సప్పగా సాగుతున్న మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చిన ఘనత రాహుల్‌దే.. నీకు చెప్పినా గోడకు చెప్పినా ఒకటే..’
‘సప్పగా సాగుతున్న మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చిన ఘనత రాహుల్‌దే.. నీకు చెప్పినా గోడకు చెప్పినా ఒకటే..’
IPL 2023: ఐపీఎల్ -16లో మరో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్. 136 పరుగులు చేయడానికి లక్నో సూపర్ జెయింట్స్ నానా తంటాలు పడింది. పేరుకు ప్రపంచ స్థాయి బ్యాటర్లు. కానీ అట్టర్ ఫ్లాఫ్ ప్రదర్శనలు.

ఐపీఎల్ - 16 లో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లకు మంచి గిరాకీ ఉన్నట్టుంది. రేటింగ్స్ కోసం ఇవన్నీ స్క్రిప్టు ప్రకారం జరుగుతున్నాయో (?) లేక నిజంగానే అంత ఇంటెన్సిటీతో చివరి ఓవర్ దాకా మ్యాచ్ లు సాగుతున్నాయో తెలియదు గానీ ఈ సీజన్ లో మరో లాస్ట్ ఓవర్, లాస్ట్ బాల్ థ్రిల్లర్ జనాలను అలరించింది. లక్నో సూపర్ జెయింట్స్ - గుజరాత్ టైటాన్స్ ల మధ్య సాగిన మ్యాచ్ కూడా ఇదే రీతిలో ముగిసింది.
కానీ ఈ మ్యాచ్ లో మాత్రం క్రెడిట్ ఇవ్వదల్చుకుంటే అది కచ్చితంగా లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్ కే ఇవ్వాలంటున్నారు ఆ జట్టు అభిమానులు. అసలు ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ లో తన బ్యాటింగ్ తో పోరును రసవత్తరంగా మార్చాడు.
అదేంటి..? ఈ మ్యాచ్ లో లక్నో బ్యాటర్లు విఫలమైనా ఆడింది రాహులే కదా. హాఫ్ సెంచరీ కూడా చేశాడు. చివరి ఓవర్ దాకా లక్నో విజయం కోసం పోరాడాడు. అయినా రాహుల్ ను విమర్శించడమేంటి..? అనుకునేవాళ్లకు గణాంకాలనే చేదు నిజాలు కళ్లు తెరిపిస్తున్నాయి. రాహుల్ ఈ మ్యాచ్ లో 68 పరుగులు చేశాడు. కానీ అందుకోసం తీసుకున్న బంతులు 61.
Image credit: PTI
అంటే లక్నో ఇన్నింగ్స్ లో పది ఓవర్లు రాహులే ఆడాడు. పది ఓవర్లలో చేసిది 68 పరుగులా. ఒక్క ఓవర్ లో 30 పరుగులు కొట్టాల్సి వస్తే వెనుకా ముందూ ఆలోచించకుండా అంతర్జాతీయ అనుభవం లేకున్నా కుర్రాళ్లు దంచికొడుతున్న రోజులివి. అలాంటిది ఏడేనిమిదేండ్లుగా ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న క్రికెటర్ 10 ఓవర్లు ఆడి చేసేవి 60 పరుగులా..?
Image credit: PTI
సరే పోనీ, లక్నో పిచ్ స్లో గా ఉంది. అందరూ తడబడ్డారు కదా అని సరిపెట్టుకుందామా అంటే అదీ లేదు. గత మ్యాచ్ లలో రాహుల్ ఏమైనా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడా..? బౌలర్లపై విరుచుకుపడుతూ వారిని చీల్చి చెండాడాడా..? అని తరిచిచూస్తే లెక్కలన్నీ బిగ్ బ్యాంగ్ బొక్కల కంటే దారుణంగా ఉన్నాయి. ఈ సీజన్ లో రాహుల్ 7 మ్యాచ్ లు ఆడి 262 రన్స్ చేశాడు. ఈ క్రమంలో అతడి స్ట్రైక్ రేట్ 113.91 గా ఉంది.
అత్యధిక పరుగులు సాధించినవారిలో టాప్ -15 లో ఉన్నవారిలో ఇంత దారుణమైన స్ట్రైక్ రేట్ ఎవరికీ లేదు. ఇక గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో రాహుల్ స్ట్రైక్ రేట్.. 111. 48 గా ఉంది. ఐపీఎల్ లో ఒక మ్యాచ్ లో 60 బంతులు ఆడి అత్యంత పేలవ స్ట్రైక్ రేట్ కలిగి ఉన్న ఆటగాళ్లలో రాహుల్ మూడో వాడు. ఈ జాబితాలో జేపీ డుమిని (93.65), ఆరోన్ ఫించ్ (109.68) లు ముందున్నారు.
ఓపెనర్ గా వచ్చిన రాహుల్.. 20 వ ఓవర్ వరకూ క్రీజులో ఉండి 68 పరుగులే చేయడం లక్నో ఓటమికి ఓ కారణమేనని ట్విటర్ వేదికగా లక్నో అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. అదే రాహుల్ కాస్త ముందుగానే బ్యాట్ ఝుళింపించినా లేక మరికొన్ని ఓవర్లు ముందు ఔటైనా ఫలితం మాత్రం కచ్చితంగా మరో విధంగా ఉండేదంటున్నారు ఆ జట్టు ఫ్యాన్స్..
స్ట్రైక్ రేట్ పై దృష్టి సారించాలని అతడికి చాలారోజులుగా అభిమానులు, క్రికెట్ మాజీలు మొత్తుకుంటున్నా అతడి తీరు మారడం లేదు. దీంతో అభిమానులు ‘నీకు చెప్పినా గోడకు చెప్పినా ఒకటే’ అని వాపోతున్నారు.