IPL 2023: గుజరాత్‌కు భారీ షాక్.. గాయంతో కేన్ విలియమ్సన్ ఔట్..
Kane Williamson Injury: చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా కేన్ మామ గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో అతడిని అప్పుడే గ్రౌండ్ నుంచి ఆస్పత్రికి తరలించి స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించగా...

Image credit: PTI
ఐపీఎల్ - 16 లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి తొలి మ్యాచ్ లోనే మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై ఘన విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ భారీ షాక్ తాకింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్.. గాయం కారణంగా ఐపీఎల్ - 16 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా కేన్ మామ గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో అతడిని అప్పుడే గ్రౌండ్ నుంచి ఆస్పత్రికి తరలించి స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించగా విలియమ్స్ గాయం తీవ్రత కాస్త ఆందోళనకరంగానే ఉందని తేలిందని సమాచారం. దీంతో విలియమ్సన్ ఈ సీజన్ మొత్తానికి తప్పుకున్నాడని గుజరాత్ టీమ్ తెలిపింది.
ఇదే విషయమై గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి స్పందిస్తూ.. ‘ఈ టోర్నీ ప్రారంభంలోనే కేన్ విలియమ్సన్ కు గాయమవడం మాక్కూడా బాధారకంగా ఉంది. అతడు త్వరగా కోలుకోవాలని మేం కోరుకుంటున్నాం..’అని తెలిపాడు. అయితే ఇందుకు సంబంధించి గుజరాత్ ఇంకా అధికారిక ప్రకటన వెలువరించలేదు.
శుక్రవారం నాడు సీఎస్కేతో జరిగిన మ్యాచ్ లో భాగంగా 13వ ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ భారీ షాట్ ఆడాడు. డీప్ స్క్వేర్ లెగ్ దిశగా వెళ్లిన బంతిని కేన్ విలియమ్సన్ అందుకునే యత్నం చేశాడు. కొంత దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. గాల్లో ఉండగానే క్యాచ్ అందుకుని బౌండరీ లైన్ ముందుకు పడేశాడు. కానీ కిందకు ల్యాండ్ అయ్యేప్పుడు బ్యాలెన్స్ తప్పడంతో పాటు మోకాలు కూడా నేలను బలంగా తాకింది. దీంతో కేన్ గాయంతో విలవిల్లాడు. పడ్డచోటునే అక్కడే లేవకుండా ఉండిపోయాడు.
Image credit: PTI
ఐపీఎల్ లో గత సీజన్ వరకూ సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన కేన్ మామను ఈ సీజన్ కు ముందు నిర్వహించిన వేలంలో గుజరాత్ టైటాన్స్.. రూ. 2 కోట్లతో కొనుగోలు చేసింది. కొద్దిరోజుల క్రితం మోచేతి గాయం నుంచి కోలుకున్న కేన్ మామ.. ఇప్పుడిప్పుడే పాత ఫామ్ ను అందుకుంటున్న వేళ మళ్లీ గాయపడటం గుజరాత్ తో పాటు న్యూజిలాండ్ జట్టుకూ ఆందోళనకరమే..
కాగా.. సీఎస్కేతో మ్యాచ్ ముగిసిన తర్వాత గుజరాత్ టైటాన్స్.. ఏప్రిల్ 4న ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. ఢిల్లీ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ కు ముందు గుజరాత్ జట్టు.. కేన్ విలియమ్సన్ రిప్లేస్మెంట్ ను ప్రకటించే అవకాశాలున్నాయి. తొలి మ్యాచ్ లో కేన్ మామ గాయపడటంతో సాయి సుదర్శన్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా దించిన గుజరాత్.. ఢిల్లీతో మ్యాచ్ లో అతడిని ఆడించొచ్చు..