సన్ రైజర్స్‌ను ముంచింది.. లక్నోను పోటీలోకి తెచ్చింది ఆ ఒక్క ఓవరే..
IPL 2023, SRH vs LSG: ఉప్పల్ వేదికగా కొద్దిసేపటి క్రితమే ముగిసిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమికి లక్నో సూపర్ జెయింట్స్ గెలుపునకు ఒకటే ఒక ఓవర్ తేడా.

Image credit: PTI
టీ20 క్రికెట్ వచ్చాక ఆట స్వరూపమే మారిపోయింది. ఫలితాలు క్షణాల్లో తారుమారవుతున్నాయి. గెలుస్తుందనుకున్న మ్యాచ్ లో ఓడటం ఓడిపోతుందనుకున్న మ్యాచ్ లో గెలవడం టీ20 మ్యాచ్ కే చెల్లింది. ఇందుకు తాజా ఉదాహరణ సన్ రైజర్స్ హైదరాబాద్ - లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్.
ఉప్పల్ వేదికగా కొద్దిసేపటి క్రితమే ముగిసిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమికి లక్నో సూపర్ జెయింట్స్ గెలుపునకు ఒకటే ఒక ఓవర్ తేడా. ఆ ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. అదే సన్ రైజర్స్ పార్ట్ టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ వేసిన 16వ ఓవర్.
ఈ ఓవర్ కు ముందు వరకూ లక్నో.. 114-2 గా ఉంది. క్రీజులో మార్కస్ స్టోయినిస్ , ప్రేరక్ మన్కడ్ ఉన్నారు. అప్పటికీ స్టోయినిస్.. 22 బంతుల్లో 28 పరుగులే చేశాడు. కానీ ఈ ఓవర్ తర్వాత లక్నో తలరాతే మారిపోయింది. అభిషేక్ శర్మ ఏకంగా ఈ ఓవర్లో 31 పరుగులు సమర్పించుకున్నాడు.
అభిషేక్ వేసిన ఆ ఓవర్లో స్టోయినిస్ ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టాడు. రెండో బాల్ వైడ్. మూడో బాల్ మరో సిక్స్ కొట్టాడు స్టోయినిస్. కానీ మూడో బాల్ అతడు అవుట్ అయ్యాడు.
ఈ క్రమంలో నికోలస్ పూరన్ క్రీజులోకి వచ్చాడు. ఇక ఇప్పుడు బాదడం పూరన్ వంతు. నాలుగు, ఐదు, ఆరు బంతులు స్టాండ్స్ లో పడ్డాయి. ఒక్క ఓవర్ పుణ్యమా అని లక్నో స్కోరు ఏకంగా 145-3కి మారింది. ఈ ఓవర్ తర్వాత సమీకరణం 24 బంతుల్లో 38 గా మారింది. చివర్లో నటరాజన్ , భువనేశ్వర్ కాస్త కట్టడి చేయడానికి యత్నించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
Image credit: PTI
ఈ ఓవర్ కు ముందు వరకూ మార్కండే 3 ఓవర్లు వేయగా గ్లెన్ ఫిలిప్స్ 2 ఓవర్లు వేశాడు. ఎవరూ లేకున్నా పార్ట్ టైమ్ స్పిన్నర్ అయిన కెప్టెన్ మార్క్‌రమ్ వేసినా కచ్చితంగా ఫలితం మరో విధంగా ఉండేది. కానీ మార్క్‌రమ్ మాత్రం అభిషేక్ శర్మ కు బంతినిచ్చి లక్నోకు విజయాన్ని వెండిపళ్లెంలో అందించాడు.
ఒకవేళ 16వ ఓవర్ కు ముందు వరకూ ఉన్నవిధంగా 114-2 మూమెంట్ కంటిన్యూ అయితే కచ్చితంగా ఫలితం ఎస్ఆర్‌హెచ్ కు అనుకూలంగా వచ్చేదే. కానీ విదాతే రాశాడో లీగ్ నిర్వాహకులే రాశాలో గానీ గానీ ‘స్క్రిప్ట్’ మారిపోయింది. లక్నోను విజయం వరించింది. సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు ఉప్పల్ లోనే సమాధి అయిపోయాయి.