అతనికి అన్యాయం జరిగింది... సోషల్ మీడియాలో సెలక్టర్లపై విమర్శల వర్షం...
IPL 2020 నుంచి ఎందరో యంగ్ క్రికెటర్లు క్రికెట్ ప్రపంచపు దృష్టిని ఆకర్షించారు. ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తితో పాటు కమ్లేశ్ నాగర్‌కోటి, కార్తీక్ త్యాగి, శివమ్ మావి, రవి బిష్ణోయ్, దేవ్‌దత్ పడిక్కల్ వంటి ఎందరో సత్తా చాటుతూ భవిష్యత్తుపై నమ్మకం పెంచుతున్నారు. అయితే కొన్నిసీజన్లుగా నిలకడైన ప్రదర్శన ఇస్తున్నా ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం సెలక్టర్లను మెప్పించలేకపోయాడు.
ఐపిఎల్ 2020 సీజన్‌లో 12 మ్యాచులు ఆడిన సూర్యకుమార్ యాదవ్, 362 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
155.36 స్టైయిక్ రేటుతో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్, రెండు సార్లు నాటౌట్‌గా నిలిచాడు. గత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సూర్యకుమార్ ఆడిన ఇన్నింగ్స్ అసాధారణం.
ఇప్పటిదాకా 97 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ దాదాపు 2 వేల పరుగులు చేశాడు. ఇందులో 18 సార్లు నాటౌట్‌గా ఉండడమే కాకుండా10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
నిన్నటి మ్యాచ్‌లో సూర్యకుమార్ క్లాస్ ఇన్నింగ్స్‌తో అతన్ని ఎందుకు భారత జట్టుకు ఎంపిక చేయడం లేదని సెలక్టర్లను నిలదీస్తున్నారు నెటిజన్లు, మాజీ క్రికెటర్లు.
సూర్యకుమార్ యాదవ్ కచ్ఛితంగా ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లే భారత జట్టులో ఉండాలని అంటున్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చెప్రా. కనీసం టీ20 సిరీస్ జట్టులో అయినా అతనికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడు చోప్రా.
సూర్యకుమార్ యాదవ్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. సెలక్టర్లు అతని ఆటను చూస్తున్నారనుకుంటున్నా... అని సెలక్టర్లపై సెటైరికల్ వ్యాఖ్యలు చేశాడు హర్భజన్ సింగ్.
‘సూర్యకుమార్ ఇన్నింగ్స్ అద్భుతం. జాతీయ జెర్సీ ధరించడానికి అతను ఇంకెంత చేయాలో అర్థం కావడం లేదు. బ్రిలియంగ్ ఇన్నింగ్స్, అదిరిపోయే షో... త్వరలోనే భారత జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నా...’ అన్నాడు మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్.
‘ఇతనిలో దమ్ము ఉంది. త్వరలోనే ఇతని నెంబర్ వస్తుంది. అందులో అనుమానం లేదు. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ సీజన్లు. సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ అద్భుతం’ అన్నాడు వీరేంద్ర సెహ్వాగ్.
మనీశ్ పాండే కంటే మంచి ప్రదర్శన ఇస్తున్న సూర్యకుమార్ యాదవ్‌ను సెలక్టర్లు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
మరికొందరైతే జ్యూరీ మెంబర్లకు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేని హీరోలు కనిపించనట్లే, సూర్యకుమార్ యాదవ్ కూడా సెలక్టర్ల కంటికి కనిపించడం లేదని విమర్శిస్తున్నారు సోషల్ మీడియా జనాలు.