అక్కడ కూడా అదరగొడుతున్న ఐపీఎల్... రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిప్ రేటింగ్!
IPL 2020 సీజన్ క్రికెట్ అభిమానులకి కావాల్సినంత మజాను అందిస్తోంది. దాదాపు 50 మ్యాచులు ముగిసినా ఇప్పటిదాకా ప్లేఆఫ్ బెర్తులపై క్లారిటీ రాకపోవడంతో ప్రతీ మ్యాచ్ ఆసక్తిరేపుతోంది. చాలా మ్యాచులు ఆఖరి ఓవర్ దాకా సాగడం, దాదాపు ఐదు సూపర్ ఓవర్ మ్యాచులు జరగడం 2020 సీజన్ స్పెషాలిటీ. దీంతో ఇక్కడే కాదు, ఇంగ్లాండ్‌లో కూడా ఐపీఎల్‌కి రికార్డు స్థాయిలో రేటింగ్‌లు వస్తున్నాయి.
ఇండియాతో పాటు 120 దేశాల్లో ఐపీఎల్ ప్రసారాలు బ్రాడ్‌కాస్ట్ అవుతున్నాయి. పొరుగుదేశం పాకిస్థాన్‌లో మాత్రం అధికారికంగా లైవ్ టెలికాస్ట్ కావడం లేదు.
ఐపీఎల్ మ్యాచులు ఉత్కంఠభరితంగా సాగుతూ వ్యూయర్‌షిప్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది...
సీజన్ ఆరంభానికి ముందు హాట్ స్టార్ సబ్‌స్కిప్షన్ ఉన్నవారికే ఐపీఎల్ మ్యాచులు చూసేందుకు సౌలభ్యం కలిపించింది.
దాంతో మొబైళ్లల్లో ఐపీఎల్ మ్యాచులు చూసేవారి సంఖ్య భారీగా పడిపోయింది. అంతేకాకుండా టీవీల్లో పున:ప్రసారం చేస్తే మొబైళ్లలో సబ్‌స్కిప్షన్ తీసుకోరనే కారణంగా రిపీట్ టెలికాస్ట్ చేయడం లేదు.
ఈ కారణంగానే ఇండియాలో వ్యూయర్‌షిప్ పడిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే బ్రిటన్‌లో మాత్రం ఐపీఎల్ మ్యాచులకు రికార్డు వ్యూయర్‌షిప్ వస్తోంది.
బ్రిటన్ బ్రాడ్‌కాస్టర్స్ ఆడియెన్స్ రీసెర్చ్ బోర్డు లెక్కల ప్రకారం ఐపీఎల్ 2020 సీజన్‌ను వారానికి దాదాపు 8 లక్షల మంది వీక్షించారు. ఈ రేంజ్‌లో వ్యూయర్‌షిప్ రావడం ఇదే తొలిసారి.
ఇంగ్లాండ్‌లో బీభత్సమైన క్రేజ్ ఉన్న ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ మ్యాచుల కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి రికార్డు వ్యూయర్‌షిప్ రావడం విశేషం.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వ్యూయర్‌షిప్ భారీగా పెరిగింది. ప్లేఆఫ్ మ్యాచుల సమయానికి వ్యూయర్‌షిప్ మరింత పెరుగుతోందని అంచనా వేస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్.
ఇంగ్లాండ్‌తో పాటు ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఆఫ్ఘాన్ వంటి దేశాల్లో కూడా ఐపీఎల్ మ్యాచ్‌లకు మంచి వ్యూయర్‌షిప్ వస్తోంది.
కరోనా విపత్తు కారణంగా ఆరు నెలలు ఆలస్యంగా మొదలైన ఐపీఎల్, అనుకున్నదానికంటే ఎక్కువగానే జనాలను ఎంటర్‌టైన్ చేసింది. ఐపీఎల్ సీజన్ ఆరంభమైన తర్వాత కరోనా వార్తలు, కేసులు కూడా తగ్గడం విశేషం.