- Home
- Sports
- Cricket
- IND vs SA: ప్రతికారానికో వేదిక.. సఫారీలకు చుక్కలు చూపించేందుకు రెడీ.. ఐదు టీ20 మ్యాచులు జరిగేదిక్కడే..
IND vs SA: ప్రతికారానికో వేదిక.. సఫారీలకు చుక్కలు చూపించేందుకు రెడీ.. ఐదు టీ20 మ్యాచులు జరిగేదిక్కడే..
India Vs South Africa T20I: గతేడాది డిసెంబర్ మాసాంతంలో వెళ్లి టెస్టులతో పాటు వన్డేలలో కూడా దక్షిణాఫ్రికా చేతిలో భంగపడ్డ భారత్ కు సువర్ణావకాశం. సఫారీలు జూన్ లో భారత పర్యటనకు రానున్నారు.

గతేడాది చివర్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లి భంగపడ్డ భారత్ జట్టు.. జూన్ లో సఫారీలకు వడ్డీతో సహా తిరిగిచ్చేందుకు సిద్ధమవుతున్నది. ఈ మేరకు బీసీసీఐ కూడా వేదికలను సిద్ధం చేసింది.
ఐపీఎల్ - 2022 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు.. దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనున్నది. జూన్ 9 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మేరకు బీసీసీఐ వేదికలను కన్ఫర్మ్ చేసింది.
జూన్ 9 న తొలి టీ 20 కటక్ లో జరుగనుంది. రెండో టీ20 12న వైజాగ్ లో, 14న మూడో టీ 20 ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతుంది.
ఇక జూన్ 17న నాలుగో టీ20 రాజ్ కోట్ వేదికగా జరగాల్సి ఉంది. ఈ సిరీస్ లో ఆఖరిదైన ఐదో టీ20.. అదే నెల 19న చెన్నై వేదికగా జరుగుతుంది.
అయితే ఐదు మ్యాచుల సిరీస్ కోసం పైన పేర్కొన్న ఐదు వేదికలతో పాటు త్రివేండ్రం, మొహాలీ, బెంగళూరు, నాగ్పూర్ కూడా పోటీ పడ్డాయి. కానీ వీటికి మాత్రం ఈ అవకాశం దక్కలేదు.
భారత్-దక్షిణాఫ్రికా ఐదు మ్యాచుల టీ20 సిరీస్ నిర్వహణ అవకాశం కోల్పోయిన వేదికలకు సెప్టెంబర్ - అక్టోబర్ లో జరుగబోయే సిరీస్ లలో అవకాశమిస్తామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
గతేడాది డిసెంబర్ లో సఫారీ పర్యటనకు వెళ్లిన భారత్.. మూడు టెస్టుల సందర్భంగా తొలి మ్యాచ్ నెగ్గినా తర్వాత రెండు మ్యాచులు ఓడింది.
ఇక వన్డేలలో అయితే మూడింటికి మూడు మ్యాచులు ఓడి ఉత్తచేతులతో స్వదేశానికి తిరిగివచ్చింది. దక్షిణాఫ్రికాతో టెస్టుల అనంతరం విరాట్ కోహ్లి.. తనకు మిగిలిఉన్న టెస్టు కెప్టెన్సీకి కూడా రాజీనామా చేశాడు. ఇక వన్డేలలో కొత్త సారథి రోహిత్ శర్మ ఈ సిరీస్ కు గైర్హాజరీ కావడంతో కెఎల్ రాహుల్ కు కెప్టెన్సీ పగ్గాలను అప్పజెప్పింది బీసీసీఐ. కానీ అతడు మాత్రం అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు.
ఇక ఇప్పుడు తిరిగి భారత పర్యటనకు రానున్న దక్షిణాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు రోహిత్ సేనకు ఇది చక్కటి అవకాశం. ఇటీవలే ముగిసిన వెస్టిండీస్, శ్రీలంక తో టీ20 సిరీస్ లలో ఆ దేశాలను వైట్ వాష్ చేసి జోరు మీదున్న టీమిండియా.. ఐపీఎల్ తర్వాత నేరుగా ఆడబోయే సిరీస్ ఇదే. మరి దక్షిణాఫ్రికాలో జరిగిన ఘోర పరాభావానికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంటుందా..?