- Home
- Sports
- Cricket
- Virat Kohli: చిన్నస్వామి స్టేడియంలో అయినా కోహ్లి అభిమానుల ‘పెద్ద’ కోరిక నెరవేరేనా..? హోంగ్రౌండ్ లో శతకం కోసం..
Virat Kohli: చిన్నస్వామి స్టేడియంలో అయినా కోహ్లి అభిమానుల ‘పెద్ద’ కోరిక నెరవేరేనా..? హోంగ్రౌండ్ లో శతకం కోసం..
India vs Srilanka 2nd Test: ఒక మిడిలార్డర్ బ్యాటరో.. అడపా దడపా సెంచరీలు చేసే ఆటగాడో సెంచరీలు చేయకపోయినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఒకప్పుడు మంచినీళ్లు తాగినంత ఈజీగా శతకాలు బాది ఇప్పుడేమో మొహం చాటేస్తుంటే మాత్రం...

28 నెలలు.. రెండున్నరేండ్లు.. రోజుల్లో చెప్పాలంటే సుమారు 850 రోజుల పైమాటే. ప్రపంచంలో ఒకప్పుడు సెంచరీలను షర్ట్ కు ఉండే బటన్ వేసుకున్నంత ఈజీగా చేసిన ఆటగాడు ఇప్పుడు అదే శతకాల కోసం వేచి చూస్తున్న రోజులవి..
అవును.. అంతర్జాతీయ కెరీర్ లో సెంచరీల వరద పారించి అతి తక్కువ వయసులోనే ఎన్నో మైలురాళ్లను అందుకున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి సెంచరీ.. ఇప్పుడు అవే వంద పరుగులు కొట్టడానికి పడరాని పాట్లు పడుతున్నాడు.
తన కెరీర్ లో 70వ సెంచరీని 2019 లో నమోదు చేశాడు కోహ్లి. అప్పట్నుంచి ఇప్పటిదాకా టెస్టులలో 28 ఇన్నింగ్స్ ఆడాడు. ప్రతి మ్యాచుకు ముందు.. ‘ఇక ఈ మ్యాచ్ లో కొడతాడు లే..’ అని అభిమానులు ఆశలు పెట్టుకోవడం.. అతడు వెనుదిరగడం.. రెండున్నరేండ్లుగా ఇదే తంతు.
మరి.. తనకు ఎంతో ఇష్టమైన చిన్నస్వామి స్టేడియంలో అయినా కోహ్లి తన అభిమానుల కోరికను మన్నిస్తాడా..? బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగబోయే రెండో టెస్టు (పింక్ టెస్టు) లో కోహ్లి సెంచరీ చేయాలని అతడి ఫ్యాన్స్ కోట్లాది ఆశలు పెట్టుకున్నారు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కి సొంత గ్రౌండ్. ఇక్కడ కోహ్లి వందలాది మ్యాచులు ఆడాడు. దీంతో తన 71వ సెంచరీని ఇక్కడే చేస్తాడని బెంగళూరు అభిమానులంతా ఆశిస్తున్నారు.
మొహాలీలో ముగిసిన తొలి (కోహ్లి వందో టెస్టు) టెస్టులోనే అతడు సెంచరీ చేస్తాడని అంతా భావించారు. కానీ కోహ్లి మాత్రం అనూహ్యంగా... 45 పరుగుల వద్దే వెనుదిరిగి మరోసారి నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అతడి అభిమానుల కళ్లన్నీ బెంగళూరు టెస్టు మీద పడ్డాయి.
అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో కూడా తొలి ఇన్నింగ్స్ లో 79 పరుగులు చేశాడు. కానీ దానిని సెంచరీగా మలుచుకోలేకపోయాడు. 71వ సెంచరీని సాధించే క్రమంలో కోహ్లి.. ఆరుసార్లు 50 ప్లస్ స్కోర్లను చేశాడేగానీ వాటిని శతకాలుగా మార్చడంలో విఫలమయ్యాడు.
ఇక బెంగళూరు టెస్టులో గనక కోహ్లి 43 పరుగుల కంటే తక్కువగా చేస్తే తన కెరీర్ లో ఆరేండ్ల తర్వాత టెస్టులలో 50 సగటు పడిపోయే ప్రమాదముంది. మూడు ఫార్మాట్లలో కలిపి 50 ప్లస్ సగటు ఉన్న అతికొద్ది మంది ఆటగాళ్లలో కోహ్లి ఒకడు.
2019లో ఈడెన్ గార్డెన్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన పింక్ బాల్ టెస్టులోనే కోహ్లి సెంచరీ చేశాడు. ఇక రేపు లంకతో జరుగబోయేది కూడా పింక్ బాల్ టెస్టే. దీంతో కోహ్లి అభిమానులు.. ఈ టెస్టులో అతడు సెంచరీ చేస్తాడని అంచనాలు వేసుకుంటున్నారు. మరి అశేషాభిమానుల కోరికను కోహ్లి మన్నిస్తాడా..? అంటే మరికొన్నిగంటలు వేచి చూడాల్సిందే.