విశాఖలో భారత్-దక్షిణాఫ్రికా బిగ్ ఫైట్.. ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
India vs South Africa : భారత్-దక్షిణాఫ్రికా మహిళా జట్లు గురువారం విశాఖపట్నంలో తలపడుతున్నాయి. వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టు మరో విజయంతో టాప్ స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
భారత్ వరుస విజయాలతో భారత్ దూకుడు.. విశాఖలో కీలక మ్యాచ్
2025 ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళా జట్టు మూడో లీగ్ మ్యాచ్‌ను గురువారం (అక్టోబర్ 9) ఆడనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. శ్రీలంక, పాకిస్తాన్‌లపై వరుస విజయాలతో జోరుమీదున్న హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు, ఇప్పుడు దక్షిణాఫ్రికాను ఓడించి టోర్నమెంట్‌లో టాప్ ప్లేస్ ను తిరిగి సాధించాలని చూస్తోంది.
ఈ మ్యాచ్ సాయంత్రం 3:00 గంటలకు (IST) ప్రారంభమవుతుంది. టాస్ 2:30 గంటలకు పడనుంది.
వైజాగ్ లో భారత్ అదరగొడుతుందా?
ఇప్పటి వరకు రెండు విజయాలతో భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ను ఓడిస్తే భారత్ మూడో స్థానానికి పడిపోవచ్చు. అందుకే దక్షిణాఫ్రికాపై విజయం అత్యంత కీలకం కానుంది.
భారత బ్యాటింగ్ విభాగం కొంత స్థిరత్వం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. స్మృతి మంధానా, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్ పెద్ద స్కోర్లు చేయకపోవడం జట్టుకు సమస్యగా మారింది. అయితే హర్లీన్ దియోల్ ఇప్పటివరకు టోర్నమెంట్‌లో 94 పరుగులతో భారత జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచింది.
దీప్తి శర్మ ఆరు వికెట్లు తీసి బౌలింగ్ విభాగాన్ని ముందుకు నడిపింది. ఆమె చివరి మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసింది. కొత్త బౌలర్ క్రాంతి గౌడ్ కూడా 3/20 ఫిగర్స్‌తో ఆకట్టుకుంది. ఇదే ఫామ్ ను కొనసాగిస్తే భారత్ మరో విజయాన్ని అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దక్షిణాఫ్రికా భారత్ కు షాక్ ఇస్తుందా?
దక్షిణాఫ్రికా జట్టు ప్రారంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే, తరువాత న్యూజిలాండ్‌పై అద్భుత విజయంతో తిరిగి గెలుపుబాటలోకి వచ్చింది.
ఇండోర్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో తజ్మిన్ బ్రిట్స్ (101), సునే లూస్ (83) సూపర్ నాక్ లతో జట్టు తరఫున 159 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దాంతో 231 పరుగుల లక్ష్యాన్ని కేవలం 41 ఓవర్లలో ఛేజ్ చేశారు.
బ్రిట్స్ ప్రస్తుతం 106 పరుగులతో దక్షిణాఫ్రికా తరఫున టాప్ రన్‌స్కోరర్‌గా ఉన్నారు. బౌలింగ్‌లో నోన్కులులెకో మ్లాబా నాలుగు వికెట్లు తీసి కీలక పాత్ర పోషిస్తోంది. లౌరా వూల్వార్డ్ నాయకత్వంలోని జట్టు ఇదే ఫామ్ ను కొనసాగించాలని చూస్తోంది. సౌతాఫ్రికా బ్యాటర్లు రాణిస్తే భారత్ గెలుపు కష్టంగా మారుతుంది.
ఇండియా vs సౌతాఫ్రికా మ్యాచ్ షెడ్యూల్
మ్యాచ్: భారత మహిళలు vs దక్షిణాఫ్రికా మహిళలు
తేదీ: గురువారం, అక్టోబర్ 9, 2025
వేదిక: డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ACA-VDCA స్టేడియం, విశాఖపట్నం
మ్యాచ్ ప్రారంభం: మధ్యాహ్నం 3:00 గంటలకు IST
టాస్ సమయం: మధ్యాహ్నం 2:30 IST
ఇండియా vs సౌతాఫ్రికా మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ & స్ట్రీమింగ్ వివరాలు ఇవే
టీవీలో ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్
ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్: జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
కాగా, భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన చివరి 24 వన్డేల్లో, భారత్ 15 మ్యాచ్‌లు గెలిచింది, దక్షిణాఫ్రికా 9 విజయాలు సాధించింది. మరోసారి భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మరొక విజయాన్ని సాధించేందుకు సిద్ధమవుతోంది.
ఇండియా vs సౌతాఫ్రికా జట్లు
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధానా (వైస్ కెప్టెన్), ప్రతికా రావల్, హర్లీన్ దియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, ఉమా చేత్రి, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీ చరణి, రాధా యాదవ్, అమంజోత్ కౌర్, అరుంధతీ రెడ్డి, క్రాంతి గౌడ్.
దక్షిణాఫ్రికా: లౌరా వూల్వార్డ్ (కెప్టెన్), అయబోంగా ఖాఖా, క్లోయ్ ట్రయన్, నడైన్ డి క్లర్క్, మారిజానే కాప్, తజ్మిన్ బ్రిట్స్, సినాలో జాఫ్టా, నోన్కులులెకో మ్లాబా, అనెరీ డర్క్సెన్, అనేకే బోష్, మసబాటా క్లాస్, సునే లూస్, కరాబో మెసో, తుమీ సెకుఖూనే, నొండుమిసో షాంగాసే.