IND vs AUS: మ్యాక్స్‌వెల్‌ను ఔట్ చేయాలనుకున్నాం, కానీ.. : భారత బౌలర్లను వెనకేసుకొచ్చిన సూర్యకుమార్ యాదవ్
Suryakumar Yadav: గ్లేన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో 223 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కాపాడుకోలేకపోయింది. దీనిపై స్పందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను త్వరగా ఔట్ చేసుంటే విజయం సాధించేవాళ్లమని పేర్కొన్నాడు.
India Vs Australia T20 Series: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో 222 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైనప్పటికీ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బౌలర్లపై కఠినంగా వ్యవహరించడానికి నిరాకరించాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ తన 100వ టీ20 మ్యాచ్ లో అజేయంగా 104 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ 222 పరుగుల భారీ స్కోరును కాపాడుకోలేకపోయినప్పటికీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బౌలర్లను వెనకేసుకురావడం కొత్త చర్చకు దారితీసింది.
భారీ పరుగులు చేసిన భారత్.. దానిని కాపాడుకోలేకపోయింది. బౌలర్లు చేతులెత్తేయడంతో భారీ లక్ష్యాన్ని సాధించడంలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. సోషల్ మీడియా వేదికగా భారత బౌలర్లపై మీమ్స్, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారత ఓటమి నేపేథ్యంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలర్లను వెనకేసుకురావడం మరో కొత్త చర్చకు దారితీసింది. టీమిండియా బౌలర్లను సమర్థించిన సూర్య.. భారీ మంచు కారణంగానే బౌలింగ్ పై ప్రభావం పడిందని పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్ లో 100వ టీ20 మ్యాచ్ ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ కేవలం 48 బంతుల్లోనే 104 పరుగులు చేసి అజేయంగా నిలిచి... కంగారులకు విక్టరీని అందించాడు. ఈ క్రమంలోనే టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును సమం చేశాడు.
మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బౌలర్లకు ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను త్వరగా ఔట్ చేసుంటే విజయం సాధించేవాళ్లమని అభిప్రాయపడ్డాడు.
220 పరుగుల లక్ష్యాన్ని విపరీతమైన మంచు పరిస్థితుల్లో కాపాడుకోవాలంటే బౌలర్లు అసాధారణ ప్రదర్శన చేయాలి. మ్యాక్స్ వెల్ ను వీలైనంత త్వరగా ఔట్ చేయాలనుకున్నాం.. బ్రేక్ టైం లో ఇదే మా వాళ్లకు చెప్పాను. కానీ, ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆసీస్ బ్యాటర్లు బౌలర్లపై ఒత్తిడి పెంచారని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.