India vs Australia: టీ20ల్లో మనోళ్లదే పైచేయి.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే..?
IND vs AUS T20 Series: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ బాధను చెరిపివేసి టీ20 ఫార్మాట్ లో సరికొత్త ఆరంభానికి భారత్ సిద్ధమైంది. ప్రపంచకప్ లో ఆడిన కీలక ఆటగాళ్లను రిటైన్ చేస్తూ ఆస్ట్రేలియాతో విశాఖపట్నం వేదికగా నేడు ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.
India vs Australia: ఐసీసీ వరల్డ్ కప్ పోరు ముగిసిన తర్వాత భారత్ ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక టీ20 సిరీస్ కు సిద్ధమైంది. టీం ఇండియా ఇప్పుడు ఆస్ట్రేలియాతో (IND vs AUS) టీ20 సిరీస్ ఆడనుంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. సిరీస్‌లోని తొలి టీ20 మ్యాచ్ గురువారం (నవంబర్ 23న) విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
ఐసీసీ ప్రపంచకప్ జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది బీసీసీఐ. భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ టీం సపోర్టు అందించనున్నారు.
ఆస్ట్రేలియాతో విశాఖపట్నం వేదికగా నేడు జరిగే మొదటి టీ20 మ్యాచ్ కు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్నాడు. జట్టులోకి చాలా మంది కొత్త ప్లేయర్లు వచ్చారు. దీంతో ఈ సిరీస్ లో ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ పోరులో ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా? అనేది చర్చ సాగుతోంది. అయితే, ఆసీస్ తో భారత్ గత రికార్డులు గమనిస్తే టీ20ల్లో భారత జట్టుదే పైచేయిగా కనిపిస్తోంది.
ఇప్పటివరకు భారత్-ఆస్ట్రేలియా జట్ల ముఖాముఖి టీ20 పోరు గణాంకాలను గమనిస్తే ఇండియాకే అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 26 టీ20లు జరిగితే అందులో భారత్ 15, ఆస్ట్రేలియా 10 మ్యాచ్ లలో గెలుపొందాయి.
భారత్-ఆస్ట్రేలియా జట్ల ముఖాముఖి పోరులో ఒక మ్యాచ్ లో మాత్రమే ఫలితం రాలేదు. భారత్ జట్టుతో పాటు ఆస్ట్రేలియా జట్టు లో కూడా మార్పులు ఉన్నాయి. ఇరు జట్లు దాడాపు కొత్త ప్లేయర్స్ తో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను ఆడబోతున్నాయి.
మొదటి మ్యాచ్ నేడు విశాఖపట్నంలో జరగనుండగా, రెండో టీ20 26న తిరువనంతపురంలో, మూడో టీ20 నవంబర్ 28న గౌహతిలో, నాలుగు, ఐదో మ్యాచ్‌లు వరుసగా నాగ్‌పూర్, హైదరాబాద్‌లో డిసెంబర్ 1, 3 తేదీల్లో జరుగుతాయి. సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు రాత్రి 7:00 గంటల నుంచి జరగనున్నాయి.