- Home
- Sports
- Cricket
- IND vs UAE : టాస్ గెలిచిన భారత్.. జట్టులో ఎవరెవరున్నారంటే? బెంచ్ లో స్టార్ ప్లేయర్ !
IND vs UAE : టాస్ గెలిచిన భారత్.. జట్టులో ఎవరెవరున్నారంటే? బెంచ్ లో స్టార్ ప్లేయర్ !
Asia Cup 2025, IND vs UAE: ఆసియా కప్ 2025లో యూఏఈతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బుమ్రా ఒక్కరే పేసర్‌గా ఉండగా, సంజూ శాంసన్ జట్టులో చోటు దక్కించుకున్నారు.

IND vs UAE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
ఆసియా కప్ 2025లో భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభమైంది. టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ ఉత్సాహంగా కనిపించాడు. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
"ఈ పిచ్ కొత్తగా, తడి కూడా ఉంది. తర్వాత డ్యూ వచ్చే అవకాశం ఉంది. అందుకే మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం" అని సూర్యకుమార్ తెలిపారు.
భారత జట్టులో మార్పులు
భారత జట్టులో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. జట్టులో ఒక్కరే ఫాస్ట్ బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే కూడా ఆల్‌రౌండర్‌గా బౌలింగ్ విభాగంలో భాగమయ్యారు. అర్ష్‌దీప్ సింగ్‌ను ఈ మ్యాచ్‌కు ఎంపిక చేయలేదు.
బదులుగా, స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చారు. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ కు ఛాన్స్ లభించింది. జితేష్ శర్మ ఈసారి బెంచ్‌కే పరిమితం అయ్యాడు.
IND vs UAE: రెండు జట్ల ప్లేయింగ్ XI
భారత్ ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్, (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
యూఏఈ ప్లేయింగ్ XI: మహ్మద్ వసీం (కెప్టెన్), అలీషాన్ షరాఫు, మహ్మద్ జోహెబ్, రాహుల్ చోప్రా (వికెట్ కీపర్), ఆసిఫ్ ఖాన్, హర్షిత్ కౌశిక్, హైదర్ అలీ, ధ్రువ్ పరాశర్, మహ్మద్ రోహిద్ ఖాన్, జునైద్ సిద్దిఖీ, సిమ్రన్‌జీత్ సింగ్.
దుబాయ్ పిచ్ పరిస్థితులు
రస్సెల్ ఆర్నాల్డ్, సంజయ్ మంజ్రేకర్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ రోజు వాతావరణం కొంత సాధారణంగా కనిపిస్తోంది. మైదానంలో ఒక వైపు 62 మీటర్ల చిన్న బౌండరీ, మరోవైపు 75 మీటర్ల పొడవైన బౌండరీ ఉంది. కొత్తగా వేసిన పిచ్‌లో 4 మిల్లీమీటర్ల గడ్డి ఉండగా, కొన్ని బేర్ పాచులు కూడా కనిపిస్తున్నాయి. దీని వల్ల పిచ్ ప్రవర్తన కొంత అనూహ్యంగా ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.
IND vs UAE: వాతావరణం ఎలా ఉంది?
ఈ మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని అంచనా. అయితే రోజంతా అత్యధికంగా 42 డిగ్రీల వేడి నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆటగాళ్లు, ప్రేక్షకులు ఇద్దరూ వేడిని ఎదుర్కోవలసి ఉంటుంది.
IND vs UAE: ఇరు జట్ల కెప్టెన్లు ఏమన్నారంటే?
యూఏఈ కెప్టెన్ మహ్మద్ వసీం మాట్లాడుతూ, "మేమూ బౌలింగ్ ఎంచుకునే ఆలోచనలో ఉన్నాం. పిచ్ కొత్తది కావడంతో మొదట్లో బంతి కాస్త సహకరించవచ్చు. మా జట్టులో స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు కలగలిపి ఉన్నారు. జూనియర్లు, సీనియర్ల సమ్మేళనంతో మంచి ప్రదర్శన ఇవ్వాలని ఆశిస్తున్నాం" అన్నారు.
భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, "ఇక్కడికి ముందే వచ్చి 3-4 మంచి ప్రాక్టీస్ సెషన్లు చేశాం. ఆటగాళ్లు పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వాతావరణం తేమతో ఉంది. రాత్రి డ్యూ ఉండే అవకాశం ఉంది. దానిని దృష్టిలో ఉంచుకుని మేము బౌలింగ్ ఎంచుకున్నాం" అని తెలిపారు.