నువ్వు యోధుడివి.. దానిని బ్యాట్ తో చంపేయ్..!! ఆరెంజ్ క్యాప్ హీరోకు సీఎస్కే సూచన
Ruturaj Gaikwad: రుతురాజ్ కు కరోనా రావడం ఇదే తొలిసారి కాదు. గతేడాది దుబాయ్ లో ముగిసిన ఐపీఎల్ రెండో అంచెకు ముందు కూడా అతడు.. వైరస్ బారిన పడ్డాడు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ స్పందిస్తూ..

మరో మూడు రోజుల్లో వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే.
టీమిండియాలోని శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ లతో పాటు స్టాండ్ బై ప్లేయర్ నవదీప్ సైనీకి కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో రుతురాజ్ గైక్వాడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్విట్టర్ లో స్పందించింది. రుతురాజ్ ను ఎంకరేజ్ చేస్తూ ఓ పోస్టును ఉంచింది.
ట్విట్టర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్పందిస్తూ... ‘నీ బ్యాట్ తో దానిని (కరోనా) పారదోలు’ అని రాసుకొచ్చింది. అంతేగాక నువ్వు యోధుడివి అని సింబాలిక్ గా చెబుతూ.. సింహాం ఎమోజీని కూడా క్యాప్షన్ కు యాడ్ చేసింది.
కాగా.. రుతురాజ్ కు కరోనా రావడం ఇదే తొలిసారి కాదు. గతేడాది దుబాయ్ లో ముగిసిన ఐపీఎల్ రెండో అంచెకు ముందు కూడా అతడు కరోనా బారిన పడ్డాడు. కానీ టోర్నీ ప్రారంభానికి ముందు కోలుకుని అందులో రాణించాడు.
2021 ఐపీఎల్ లో మహారాష్ట్ర కు చెందిన ఈ యువ బ్యాటర్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ .. 635 పరుగులు చేశాడు. దీంతో అతడికి ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు సాధించినవారికి ఇచ్చేది) కూడా దక్కింది. అదే ప్రదర్శన డిసెంబర్ లో ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా కంటిన్యూ చేశాడు.
ఫలితంగా జనవరిలో జరిగిన దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ కు రుతురాజ్ ఎంపికయ్యాడు. కానీ అక్కడ అతడికి ఆడే అవకాశం దక్కలేదు. ఇక తాజాగా వెస్టిండీస్ సిరీస్ కు ఎంపిక చేసినా.. ఈ సిరీస్ కు ముందే అతడు కరోనా బారిన పడటం దురదృష్టకరం.