IND vs PAK: క్రేజీ బజ్.. భారత్-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్.. బిగ్ ఫైట్ కు గ్రీన్ సిగ్నల్ లభించేనా!
India Pakistan Cricket Series: భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్ జరగాలంటే భారత ప్రభుత్వం నుంచి బీసీసీఐ తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉన్న వైరం నేపథ్యంలో ఇండియా-పాక్ మ్యాచ్ అంటే ఇరు దేశాల ప్రజల్లోనే కాకుండా యావత్ ప్రపంచం సైతం ఆసక్తికరంగా చూస్తుంది.
India Pakistan Cricket: భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటేనే ఆ క్రేజ్ మాములుగా ఉండదు. ఇరు దేశాల్లోనే కాకుండా క్రికెట్ ప్రపంచం కూడా ఈ రెండు దేశాల మ్యాచ్ ల కోసం ఆత్రుతను ప్రదర్శిస్తుంది. ఇదే క్రమంలో ఇప్పుడు ఒక క్రేజీ బజ్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. త్వరలో భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ గురించి పలు ఊహాగనాలు వినిపిస్తున్నాయి.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా కాలంగా ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ లను కొనసాగించాలని వాదిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ జకా అష్రఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్- పాకిస్తాన్ సిరీస్ గురించి మరోసారి వార్తలు రావడానికి కూడా ఇదే కారణం. పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్ బీసీసీఐ కార్యదర్శి జైషాను కూడా కలిశారు. ఇరు దేశాల క్రికెట్ సిరీస్ గురించి కూడా చర్చించినట్టు సమాచారం. ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయి.
Ind vs Pak
'బీసీసీఐ కార్యదర్శి జై షాను కలిశాను. భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్ లను ఆయన క్రమం తప్పకుండా సమర్థిస్తున్నారు. అయితే ఈ సిరీస్ ను ప్రారంభించాలంటే బీసీసీఐకి భారత ప్రభుత్వం నుంచి అనుమతి అవసరం. ఈ ఏడాది భారత్ లో ఎన్నికల తర్వాత శుభవార్త వస్తుందని ఆశిస్తున్నాం' అని జకా అష్రఫ్ వ్యాఖ్యలు చేశారు.
Ind vs Pak
భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ గురించి పీసీబీ ఛైర్మన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీసీసీఐ నిజంగా భారత్-పాక్ సిరీస్ ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటే, క్రికెట్ అభిమానులకు చాలా కాలం తర్వాత ఉత్కంఠభరిత పోరాటాన్ని చూసే అవకాశం లభిస్తుంది. భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూసే వారు ఇరు దేశాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.
దశాబ్ద కాలంగా భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగడం లేదు. భారత్-పాకిస్థాన్‌ల మధ్య సిరీస్ సమీప భవిష్యత్తులో ప్రారంభం అయ్యే అవకాశాలు ఎలా మారుతాయో చూడాలి. పాక్ తో సిరీస్ కు భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపే వరకు పాకిస్థాన్‌తో భారత్ ఎలాంటి ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్‌లు ఆడదని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వస్తున్న వార్తలపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి !