ఇదెక్కడి క్రేజ్ మామా.. వచ్చే ఏడాది మ్యాచ్ కు ఇప్పుడే హౌస్‌ఫుల్
India Tour of England 2025: సాధారణంగా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే స్టేడియం జనాలతో కిక్కిరిపోవాల్సిందే. అలాంటి క్రేజ్ ఇప్పుడు మరో జట్టుకు కూడా వచ్చి చేరింది. వచ్చే ఏడాది జరిగే మ్యాచ్ టిక్కెట్లన్నీ ఇప్పుడే అమ్ముడయ్యాయి.
India Tour of England 2025: ఫుట్ బాల్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు మస్తు క్రేజ్ ఉంది. భారత్ విషయానికి వస్తే.. ప్రజలు క్రికెట్ తో భావోద్వేగ అనుబంధాన్ని కలిగి ఉంటారు. భారత్ ఆడే మ్యాచ్ లు అంటే క్రికెట్ లవర్స్ కు పండగే. ఇదే క్రమంలో 2025లో జరగనున్న మ్యాచ్‌పై అభిమానుల్లో అద్భుతమైన క్రేజ్ నెలకొంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అతిపెద్ద ప్రత్యర్థులలో ఒకటిగా ఉన్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు ఉండే క్రేజ్ వచ్చింది.
భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ చూడటానికి రెండు దేశాలతో మాత్రమే కాదు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. దీని కోసం చాలా మంది అభిమానులు తమ ముఖ్యమైన పనిని కూడా వాయిదా వేస్తారు.. రాబోయే రోజులకు షెడ్యూల్ చేస్తారు. వచ్చే ఏడాది కూడా భారత్ పాక్ తో కాకుండా మరో జట్టుతో ఆడబోయే మ్యాచ్ పై కూడా ఇదే రకమైన క్రేజ్ నెలకొంది.
భారత్-పాక్ మ్యాచ్ కాదు.. భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్‌కు అమేజింగ్ క్రేజ్
ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. వీటిలో ఒక మ్యాచ్‌లో మొదటి నాలుగు రోజులు హౌస్‌ఫుల్‌గా ఉన్నాయి. వచ్చే ఏడాది జరిగే మ్యాచ్ టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఇది టెస్టు మ్యాచ్ కావడం విశేషం. అవును ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ ఆడబోయే రెండవ టెస్ట్ మ్యాచ్ మొదటి నాలుగు రోజుల టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
ఇంగ్లండ్‌లో జరిగే యాషెస్ యేతర టెస్టు తొలి నాలుగు రోజుల టిక్కెట్లు పూర్తిగా బుక్ కావడం ఇదే తొలిసారి. మ్యాచ్ జరిగే స్టేడియం అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ఈ సమాచారం పంచుకుంది. ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం ఎక్స్ అకౌట్ లో.. 'భారత్‌తో జరిగే పురుషుల టెస్టులో 1-4 రోజులు టిక్కెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి! ప్రారంభానికి నాలుగు రోజుల ముందే టిక్కెట్లు అమ్ముడయిన మొదటి యాషెస్ యేతర టెస్టు" అని పేర్కొంది.
IND vs ENG, India, England
ఇంగ్లండ్‌లో భారత్ పర్యటన షెడ్యూల్ ఇదే
2025లో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. జూన్ 20న లీడ్స్‌లోని హెడింగ్లీలో ప్రారంభ మ్యాచ్‌తో సిరీస్ ప్రారంభమవుతుంది. జూలై 2 నుండి ప్రారంభమయ్యే రెండవ మ్యాచ్‌కు ఎడ్జ్‌బాస్టన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సిరీస్ జూన్ 20 నుండి ఆగస్టు 4 వరకు కొనసాగుతుంది. దీని మ్యాచ్‌లు లీడ్స్, బర్మింగ్‌హామ్, లండన్ (లార్డ్స్), మాంచెస్టర్, లండన్ (ది ఓవల్)లలో జరుగుతాయి.
2022 తర్వాత తొలిసారి ఇంగ్లండ్ టూర్ కు భారత్
గత కొన్నేళ్లుగా భారత్, ఇంగ్లండ్ మధ్య కొన్ని ఉత్కంఠభరితమైన క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి. 2021 పర్యటనలో భారత్ ఇంగ్లాండ్‌పై ఆధిపత్యం చెలాయించింది. లండన్‌లో జరిగిన రెండు టెస్టుల్లోనూ గెలిచి 2-1 ఆధిక్యంలో నిలిచింది. అయితే, కోవిడ్-19 మహమ్మారి కారణంగా మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టు వాయిదా పడింది.
జూలై 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది, దీని కారణంగా ఇంగ్లండ్‌లో సిరీస్‌ను గెలుచుకునే అవకాశాన్ని కూడా కోల్పోయింది. 2022 టెస్టు తర్వాత భారత్ తొలిసారిగా వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఇది జట్టుకు కొత్త ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఎడిషన్‌కు ప్రారంభ మ్యాచ్.