IND vs AUS: దెబ్బ అదిరింది.. ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకున్న భారత్
India vs Australia: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత్ దెబ్బకు ఆస్ట్రేలియా అదిరింది. దుబాయ్ లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై విజయంతో టీమిండియా 2023 ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి ప్రతీకారం తీర్చుకుంది.

Virat Kohli
India vs Australia: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాను అదరిపోయే దెబ్బకొట్టింది టీమిండియా. కంగారుల గర్వాన్ని అణచివేసింది. 2023 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ 1 లో 4 వికెట్ల తేడాతో ఆసీస్ ను చిత్తుగా ఓడించింది. ఈ ఓటమితో కంగారూ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్ అయింది. స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ టీమ్ ఇండియా ఛేజింగ్ మాస్టర్ గా మరోసారి నిలిచాడు. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన 84 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఆసీస్ బ్యాటింగ్ ను దెబ్బకొట్టిన భారత బౌలర్లు
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ 1లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. భారత జట్టు మరోసారి అద్బుతమైన బౌలింగ్ తో అదరగొట్టింది. వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీలు కీలకమైన వికెట్లు తీసుకోవడతో కంగారు టీమ్ భారీ స్కోర్ చేయలేకపోయింది.
దూకుడుగా ఆడుతున్న ట్రావిస్ హెడ్ ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు. కెప్టెన్ స్టీమ్ స్మిత్ 73 పరుగులు, అలెక్స్ క్యారీ 61 పరుగుల ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 264 పరుగులు చేసింది. భారత బౌలర్లు రాణించడంతో పూర్తి ఓవర్లు ఆడకుండానే ఆసీస్ ఆలౌట్ అయింది.
విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్
265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆరంభంలో అద్భుతంగా ఆడాడు.. దానిని పెద్ద ఇన్నింగ్స్ గా మార్చలేకపోయాడు. అతను 28 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ భారత ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. 98 బంతుల్లో 5 ఫోర్లతో 84 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, విరాట్ కోహ్లీ వికెట్ పడిన తర్వాత మ్యాచ్ అటుఇటుగా కనిపించింది.
కేఎల్ రాహుల్ సిక్సర్ తో భారత్ కు గెలుపు పరుగులు అందించాడు
కానీ, ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా తన సిక్సర్లతో దుమ్మురేపాడు. కొద్దిసేపు క్రీజులో ఉన్న హార్దిక్ 24 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్ తో 28 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ మ్యాచ్ ముగిసే వరకు క్రీజులో ఉండి భారత్ కు విజయాన్ని అందించాడు. సిక్సర్ తో మ్యాచ్ ను ముగించాడు. కేఎల్ రాహుల్ 42 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ తో అజేయంగా నిలిచాడు. 84 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లోకి భారత్
భారత ప్లేయర్లలో విరాట్ కోహ్లీ 84, శ్రేయాస్ అయ్యర్ 45, కేఎల్ రాహుల్ 42* పరుగులు, హార్దిక్ పాండ్యా 28 పరుగులు చేశారు. భారత జట్టు 48.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 267 పరుగులతో విజయాన్ని అందుకుంది. ఆసీస్ బౌలర్లలో ఎలిస్ 2, ఆడం జంపా 2 వికెట్లు తీసుకున్నారు.
ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌కు అర్హత సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్‌లో రెండవ మ్యాచ్ మార్చి 5న న్యూజిలాండ్ - దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో భారత్ తో టైటిల్ కోసం పోటీ పడుతుంది.