నాతో నాకే పోటీ నాకు నేనే పోటీ.. నవీన్‌కు కోహ్లీ స్ట్రాంగ్ కౌంటర్
Kohli vs Naveen: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పదే పదే గెలుకుతున్న ఆఫ్గాన్ బౌలర్, ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న నవీన్ ఉల్ హక్, ఆ జట్టు మెంటార్ గౌతం గంభీర్ లకు కింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తనకు ఎవరితోనూ పోటీ లేదని చెప్పకనే చెప్పాడు.

మంగళవారం ముంబై - బెంగళూరు మధ్య వాంఖెడే వేదికగా జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఒక్క పరుగుకే నిష్క్రమించిన తర్వాత నవీన్ ఉల్ హక్ తన ఇన్‌స్టా స్టోరీస్ లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూస్తూ మామిడి పండ్లు తింటున్న ఫోటోను షేర్ చేసి ‘స్వీట్ మ్యాంగోస్’ అని పోస్టు పెట్టాడు.
గంభీర్ కూడా కోహ్లీ వికెట్ తీసిన బెహ్రన్‌డార్ఫ్ ఫోటోను షేర్ చేస్తూ ‘వాట్ ఎ ప్లేయర్ @బెహ్రన్‌డార్ఫ్’ అని ఇన్‌స్టా స్టోరీస్ లో రాసుకొచ్చాడు. ఈ ఇద్దరూ కోహ్లీకి కౌంటర్ ఇచ్చారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.
ఎందుకంటే లక్నోతో బెంగళూరు మ్యాచ్ లో కోహ్లీ - గంభీర్ - నవీన్ ఉల్ హక్ గొడవ తర్వాత ఎప్పుడూ లేనిది విరాట్.. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్, లక్నో తో మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వృద్ధిమాన్ సాహా ఫోటోను షేర్ చేస్తూ ‘వాట్ ఎ ప్లేయర్ @వృద్ధి’ అని ఇన్‌స్టా స్టోరీస్ లో రాసుకొచ్చాడు. అయితే ఇదేదో సాహాపై ప్రేమ అనుకుంటే పొరపాటేనని అతడితో పాటు ఈ పోస్ట్ పెట్టిన వారందరికీ తెలుసు.
కోహ్లీకి కౌంటర్ గానే తాజాగా నవీన్, గంభీర్ లు సెటైర్లు వేశారు. బెంగళూరు ఓటమి కన్ఫర్మ్ అయిన తర్వాత నవీన్ మరోసారి తన ఇన్‌స్టాలో ‘రౌండ్ టూ విత్ దీస్ మ్యాంగోస్.. నేను ఇంతవరకు ఎప్పుడూ ఇటువంటి మామిడి పండ్లను తినలేదు..’ అని షేర్ చేశాడు.
ఇంత జరిగితే కోహ్లీ ఊరుకుంటాడా..? ఛాన్సే లేదు. కామ్ గా ఉంటే అతడు కోహ్లీ ఎందుకు అవుతాడు. ముంబై - బెంగళూరు మ్యాచ్ ముగిశాక తన ట్విటర్ లో చీకట్లో ఓ బల్బు వెలుతురులో ఏదో ఆలోచనలో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘పోటీ అంతా మీ హెడ్ లోనే ఉంది. వాస్తవంలో నీతో నీకే పోటీ’అని రాసుకొచ్చాడు.
ఈ పోస్ట్ గురించి కూడా కోహ్లీ ఫ్యాన్స్ పరిపరి విధాలుగా చెప్పుకుంటున్నారు. తనకు ఎవరితోనూ పోటీలేదని.. తనతో తనకే పోటీ అని కోహ్లీ చెప్పకనే చెప్పాడని, ఇక భజన బ్యాచ్ బ్యాగులు సర్దుకుంటే మంచిదని నవీన్, గంభీర్ లను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.