- Home
- Sports
- Cricket
- కోహ్లీ విజయాలు అందిస్తున్నా అతడిని తొలగించాల్సిన అవసరమేమొచ్చింది..? బీసీసీఐ పై మదన్ లాల్ ఫైర్
కోహ్లీ విజయాలు అందిస్తున్నా అతడిని తొలగించాల్సిన అవసరమేమొచ్చింది..? బీసీసీఐ పై మదన్ లాల్ ఫైర్
Madan Lal on Virat Kohli: టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పుపై చర్చ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. విరాట్ విజయవంతంగా జట్టును నడిపిస్తున్నప్పుడు అతడిని తప్పించాలనే అవసరమెందుకు వచ్చిందని సీనియర్ ఆటగాళ్లు ప్రశ్నిస్తున్నారు.

భారత క్రికెట్ జట్టులో వన్డే కెప్టెన్సీ మార్పు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నది. టీమిండియాలో అత్యంత విజయాల శాతం కలిగి ఉన్న విరాట్ కోహ్లీని కాదని రోహిత్ శర్మను సారథిగా నియమించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఇదే విషయమై భారత క్రికెట్ మాజీ దిగ్గజం ఆల్ రౌండర్ మదన్ లాల్.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)పై ఫైర్ అయ్యాడు. విరాట్ విజయాలు సాధిస్తున్నా అతడిని తొలగించాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించాడు. సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయంపై కోహ్లీ కచ్చితంగా విముఖత చూపి ఉంటాడని ఆయన అభిప్రాయపడ్డాడు.
మదన్ లాల్ మాట్లాడుతూ.. ‘సెలెక్టర్లు దీని (కెప్టెన్సీ మార్పు) పై ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు. విరాట్ కోహ్లీకి వన్డేలలో కెప్టెన్ గా మంచి రికార్డుందని చెబుతున్నప్పుడు అతడిని ఎందుకు తొలగించాలి..? టీ20 ల నుంచి విరాట్ ఎందుకు తప్పుకున్నాడో నేను అర్థం చేసుకోగలను.
వన్డే, టెస్టు క్రికెట్ పై దృష్టి సారించడానికే అతడు టీ20 సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు. అయితే 2023 వన్డే ప్రపంచకప్ దాకా కోహ్లీ నాయకుడిగా కొనసాగుతాడని నేను భావించాను. ఒక బలైమన జట్టును తయారుచేయడం చాలా కష్టం కానీ అదే జట్టును నాశనం చేయడం చాలా ఈజీ...’ అంటూ ఫైర్ అయ్యాడు.
అంతేగాక.. పరిమిత ఓవర్ల క్రికెట్ కు ఇద్దరు కెప్టెన్ల ఫార్ములా భారత్ కు సెట్ కాదనే ఉద్దేశంతోనే రోహిత్ శర్మను వన్డే సారథిగా నియమించానని బీసీసీఐ చీఫ్ గంగూలీ చెప్పడాన్ని కూడా మదన్ లాల్ తప్పుపట్టాడు. ఇందులో గందరగోళం ఏముందని ప్రశ్నించాడు.
‘ఇందులో గందరగోళం ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. ప్రతి కెప్టెన్ కు ఒక్కో శైలి ఉంటుంది. ఇక గందరగోళం దేనికి..? టెస్ట్ క్రికెట్ కు, పరిమిత ఓవర్ల క్రికెట్ కు చాలా తేడా ఉంది.
ఇక విరాట్ కోహ్లీ గానీ రోహిత్ శర్మ గానీ వారి జట్లను నడిపించడంలో తమదైన శైలి కలిగిఉన్నారు. ఎంఎస్ ధోని టెస్ట్ కెప్టెన్ గా తప్పుకున్నాక.. రెండేండ్ల పాటు వన్డే, టీ20 లకు కెప్టెన్ గా కొనసాగలేదా..? అప్పుడు లేని క్లారిటీ ఇప్పుడెందుకు వచ్చింది..? అన్నింటికంటే అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు ప్రొఫెషనల్ గా ఆడటం.. రాణించడం ముఖ్యమైనది’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.