- Home
- Sports
- Cricket
- Virat Kohli: అలిసిపోయావ్ రెస్ట్ తీసుకో..! వద్దు ఆడు.. ఆడకుంటే యుద్ధమెలా గెలుస్తావ్..? కోహ్లిపై ఎవరి మాట వారిదే
Virat Kohli: అలిసిపోయావ్ రెస్ట్ తీసుకో..! వద్దు ఆడు.. ఆడకుంటే యుద్ధమెలా గెలుస్తావ్..? కోహ్లిపై ఎవరి మాట వారిదే
TATA IPL 2022 GT vs RCB: ఫామ్ లేమితో తంటాలు పడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ కు ఈ మధ్య కాలంలో విమర్శలతో పాటు సలహాలు కూడా ఊహించని విధంగా వస్తున్నాయి. అతడు విశ్రాంతి తీసుకోవాలని కొందరంటుంటే.. వద్దు.. ఆడాలని మరికొందరు చెబుతున్నారు

చాలాకాలంగా విరామమనేదే లేకుండా ఆడుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి కొన్నాళ్లు రెస్ట్ తీసుకోవాలని, అలా అయితే అతడు తిరిగి మునపటి ఫామ్ ను కొనసాగించగలడని గత కొద్దిరోజులుగా అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తో పాటు చాలా మంది క్రికెట్ దిగ్గజాలు, అతడి విమర్శకులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే దీనికి పూర్తి విరుద్ధమైన అభిప్రాయంతో ఉన్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.
విరామం తీసుకోవడం వల్ల కోహ్లి కి ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదని, అతడు ఆట ఆడుతూనే ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఆడకుంట ఇంట్లో కూర్చుంటే పరుగులు ఎలా సాధిస్తాడని చోప్రా చెప్పుకొచ్చాడు.
ఇదే విషయమై తన యూట్యూబ్ ఛానెల్ లో స్పందిస్తూ.. ‘ఒకవేళ విరాట్ ఆడటం మానేసి విరామం తీసుకుంటే అతడు పరుగులెలా సాధిస్తాడు. యుద్ధం గెలవాలంటే మీరు పోరాడాలి. కిందపడినా సరే చివరి క్షణం వరకు పోరాడుతూనే ఉండాలి.
చాలా మంది అతడిని విరామం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఫామ్ లో లేకపోవడానికి అతడు రెస్ట్ తీసుకోవడానికి సంబంధం లేదు. గడిచిన నాలుగైదు నెలలుగా అతడు మూడు ఫార్మాట్లలో ఆడుతుండటం వల్ల చాలా మంది అలా అని ఉండొచ్చు. కానీ అది నిజం కాదు.
కొవిడ్ సందర్భంగా ఆరు నెలలు కోహ్లి విరామం తీసుకున్నాడు కదా. మరి ఆ తర్వాత ఏం మారింది..? ఇక్కడ కోహ్లి రెస్ట్ తీసుకోవడం ముఖ్యం కాదు. అతడు ఆడాలి. పరుగులు సాధించాలి. అలాంటప్పుడే అతడు ఫామ్ ను అందుకోగలుగుతాడు...’ అని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్-2022 లో మునుపెన్నడూ లేని విధంగా వరుసగా విఫలమవుతున్న కోహ్లి.. 9 మ్యాచుల్లో 128 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. గడిచిన మూడు మ్యాచుల్లో 2 డకౌట్లు, ఓసారి 9 పరుగులు చేశాడు. అదీగాక అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో సెంచరీ లేక రెండున్నరేండ్లు గడిచిపోవడంతో కోహ్లి ఫామ్ సర్వత్రా చర్చనీయాంశమైంది.